Omicron sub-variants: మహారాష్ట్రలో ఒమిక్రాన్ సబ్-వేరియంట్ B.A.4, B.A.5 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో నాలుగు B.A.4, మూడు B.A .5 కేసులు గుర్తించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Omicron sub-variants: కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా యావత్తు ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తోంది. భారతదేశంపై కూడా ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. కరోనా రెండో వేవ్ లో చాలా మందిని కోల్పోయింది. వ్యాక్సిన్ ప్రభావంతో కరోనా మహమ్మారి (Coronavirus) తగ్గుముఖం పట్టింది. సాధారణ జీవితం గడుపుతున్న వేళ మరో కొత్త వేరియంట్లు వెలుగులోకి మళ్లీ కలకలం సృష్టిస్తుంది. తాజాగా దేశంలో ఒమిక్రాన్ సబ్-వేరియంట్ B.A.4, B.A.5 కేసులు వెలుగులోకి వచ్చాయి.
మహారాష్ట్రలో కొత్త ఓమిక్రాన్ సబ్-వేరియంట్ తొలి కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో నాలుగు B.A.4, మూడు B.A.5 కేసులను గుర్తించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే.. బాధితుల్లో తేలికపాటి లక్షణాలే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారందరూ హోం ఐసోలేషన్‌లోనే చికిత్స పొందుతున్నారని సీనియర్ ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. దక్షిణాఫ్రికాలో మొదటిసారి గుర్తించిన ఈ వేరియంట్ ప్రపంచంలోని పలు దేశాలకు వ్యాప్తిచెందింది. భారత్‌లో ఇప్పటి వరకూ తెలంగాణ, తమిళనాడులోనే మూడు కేసులు బయటపడ్డాయి.
“ జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నిర్వహించింది. ఫరిదాబాద్‌లోని ఇండియన్ బయలాజికల్ డేటా సెంటర్ కూడా వీటిని ధ్రువీకరించింది. పూణేకు చెందిన ఏడుగురు వ్యక్తుల్లో ఒమిక్రాన్ సబ్-వేరియంట్ నిర్ధారణ అయ్యింది.. నలుగురులో బీ.ఏ.4. ముగ్గురులో బీ.ఏ.5 ఉన్నట్టు తేలింది.. బాధితుల్లో 9 ఏళ్ల చిన్నారి సహ నలుగురు బాధితులు 50 ఏళ్లు దాటినవాళ్లు.. మరో ఇద్దరు 20-40 ఏళ్ల వారు ఉన్నారు. ఇందులో ఆరుగురు రెండు డోసుల టీకాను కూడా తీసుకున్నారు. అందులో ఒకరు బూస్టర్ డోసును కూడా తీసుకున్నారు. వారందరికీ కోవిడ్ -19 యొక్క తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందారు, ”అని అధికారి తెలిపారు.
మే 4 నుంచి 18 మధ్య వీరి నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలకు పంపామన్నారు. బాధితుల్లో ఇద్దరు దక్షిణాఫ్రికా, బెల్జియంలో పర్యటించగా.. ముగ్గురు కేరళ, కర్ణాటకలకు వెళ్లొచ్చారని వివరించారు. మరో ఇద్దరికి సంబంధించిన ప్రయాణ చరిత్ర లేదనీ. బాధితులతో కాంటాక్ట్ అయి ఉండోచని భావిస్తున్నారు.
మాస్క్ ధరించాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే విజ్ఞప్తి
పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా మాస్కులు ధరించాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో కరోనా ఇన్‌ఫెక్షన్ రేటు 1.59 శాతంగా ఉందని, ముంబై, పూణేలలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయని, ముంబైలో కరోనా రోగుల సంఖ్య 52.79 శాతానికి పెరిగిందని చెప్పారు. థానే, రాయ్‌గఢ్, పాల్ఘర్ జిల్లాల వంటి పరిసర ప్రాంతాలలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోందనీ, ప్రస్తుతం రాష్ట్రంలో ఒక రోగి మాత్రమే వెంటిలేటర్‌పై ఉండగా 18 మంది రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నారని తెలిపారు.
