Asianet News TeluguAsianet News Telugu

దేశంలో మళ్లీ పడగ విప్పుతోన్న బ్లాక్ ఫంగస్... యూపీలో తొలి కేసు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో (uttar pradesh) తొలి బ్లాక్ ఫంగస్ కేసు (black fungus) నమోదైంది. కాంట్‌ ప్రాంతానికి చెందిన 45 సంవత్సరాల వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని, అతనికి మధుమేహం ఉందని జీఎస్‌వీఎం మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంజయ్‌ కాలా చెప్పారు. కంట్లో నొప్పిగా ఉందని ఆ వ్యక్తి వచ్చాడని... పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలిందని డాక్టర్ తెలిపారు

first black fungus case found in up
Author
Lucknow, First Published Jan 18, 2022, 6:55 PM IST

దేశంపై మరోసారి కరోనా (coronavirus) పంజా విసిరుతోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజూ లక్షల్లో నమోదవుతున్న కేసులతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఓవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ (omicron) వేరియంట్‌లు హడలెత్తిస్తున్నాయి. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని అంతా వర్రీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మళ్లీ బ్లాక్ ఫంగస్.. కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో (uttar pradesh) తొలి బ్లాక్ ఫంగస్ కేసు (black fungus) నమోదైంది. 

కాంట్‌ ప్రాంతానికి చెందిన 45 సంవత్సరాల వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని, అతనికి మధుమేహం ఉందని జీఎస్‌వీఎం మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంజయ్‌ కాలా చెప్పారు. కంట్లో నొప్పిగా ఉందని ఆ వ్యక్తి వచ్చాడని... పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలిందని డాక్టర్ తెలిపారు. షుగర్‌ కారణంగా ఆ వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్లు భావిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. బాధితుడిని బ్లాక్‌ ఫంగస్‌ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 

కాగా.. గతేడాది కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో దేశాన్ని బ్లాక్‌ ఫంగస్‌ బెంబేలెత్తించింది. ఆ సమయంలో అనేక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూశాయి. ఫంగస్‌ కారణంగా పలువురు మరణించగా.. మరికొందరు కంటి చూపును సైతం కోల్పోయారు. ఈ క్రమంలో మరోసారి బ్లాక్ ఫంగస్ కేసు నమోదవడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవాలని, స్టెరాయిడ్లు ఇష్టమొచ్చినట్లు కాకుండా జాగ్రత్తగా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

మరోవైపు భారత్‌లో గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,38,018  కరోనా కేసుల నమోదయ్యాయి. అయితే గత రెండు రోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గడం కొద్దిగా ఊరట కలిగించే అంశమని చెప్పాలి. తాజాగా 310 కరోనాతో మంది మరణించారు. దీంతో కరోనాతో మొత్తం మరణాల సంఖ్య 4,86,761కి చేరింది. నిన్న కరోనా నుంచి 1,57,421 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనాను జయించిన వారి సంఖ్య 3,53,94,882 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 17,36,628 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 14.43 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు.. 94.09 శాతం, యాక్టివ్ కేసులు.. 4.62 శాతంగా ఉంది. ఇక, శనివారం (జనవరి 15) రోజున దేశంలో 16,49,143 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 70,54,11,425కి చేరినట్టుగా తెలిపింది. 

మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 79,91,230 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,58,04,41,770కి చేరింది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. ఇప్పటివరకు దేశంలో 8,891 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios