ఉత్తర ప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై కొందరు దుండగులు హత్యాయత్నం చేశారు. హోలీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేపై కాల్పులు జరిపారు. ఇలా బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడినప్పటికి హుటాహుటిన హాస్పిటల్ కు తరలించడం ఎమ్మెల్యే ప్రాణాలతో బయటపడ్డారు. 

ఉత్తర ప్రదేశ్ లఖీంపూర్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే యోగేశ్ వర్మ గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అనుచరులతో కలిసి హోలీ  ఆడారు. అయితే ఈ సందర్భంగా కార్యాలయం వద్దకు ఓ గుర్తు తెలియని దుండగుడు తుపాకీతో ప్రవేశించి ఎమ్మెల్యేపై కాల్పులకు తెగబడ్డాడు. 

అయితే ఈ కాల్పుల నుండి తప్పించుకునే క్రమంలో ఎమ్మెల్యే కాలులోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో అక్కడున్నవారు హుటాహుటిన ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.  చికిత్స అనంతరం ఎమ్మెల్యే సురక్షితంగా వున్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రాణాపాయమేమీ లేదని...మరికొద్ది రోజుల్లో ఆయన కోలుకుంటారని తెలిపారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని స్థానిక ఎస్పీ వెల్లడించారు. కాల్పులకు తెగబడ్డ దుండగుడిని గాలించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తొందర్లోనే అతన్ని పట్టుకుంటామని ఆమె తెలిపారు.