చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై మాధవరంలో శనివారం నాడు సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. మంటలు పక్కనే ఉన్న మరో గోడౌన్ కు వ్యాపించాయి. గోడౌన్ల వద్ద పార్క్ చేసి ఉన్న పది లారీలు కూడ మంటలకు దగ్దమయ్యాయి.

చెన్నై శివార్లలోని మాధవరం పరిసరాలు గోడౌన్లు, పలు చిన్న తరహా పరిశ్రమలున్నాయి. ఇక్కడే ఇటీవల సబర్బన్‌ బస్‌ టెర్మినల్‌ను సైతం ఏర్పాటు చేశారు.  మాధవరం జంక్షన్‌లో సబర్బన్‌ బస్‌ టెర్మినల్‌ వెనుక కూత వేటు దూరంలో ఉన్న రసాయన పరిశ్రమలో హఠాత్తుగా శనివారం సాయంత్రం సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశారు.

అగ్ని ప్రమాదం జరగిన విషయం తెలుసుకొన్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు.  మాధవరం, తిరువొత్తియూరు, చెన్నై, తిరువళ్లూరుల నుంచి పదికి పైగా అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పారు. 

గోడౌన్‌కు రెండు వందల మీటర్ల వరకు వేడి సెగ తాకడంతో సమీపంలోకి వెళ్లలేని పరిస్థితిల్లో అగ్నిమాపక సిబ్బంది వెనక్కి రావాల్సిన వచ్చింది. చివరకు మెట్రో వాటర్‌ బోర్డుకు చెందిన పది లారీల ద్వారా నీటిని తరలించారు.

ఆ పరిసరాల్లో వేడిసెగ మరింతగా బయలుదేరకుండా పక్కనే ఉన్న భవనాలకు మంటలు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అయినా, ఆ గోడౌన్‌కు పక్కనే ఉన్న మరో గోడౌన్‌కు మంటలు వ్యాపించాయి. అక్కడున్న పది లారీలు దగ్ధమయ్యాయి. ఆ గోడౌన్లో ఉన్న వస్తువులు దగ్ధమయ్యాయి. 

మాధవరంలో అగ్ని ప్రమాదం జరిగిన గోడౌన్‌లో వంద కోట్లు విలువగల రసాయనలు ఉన్నట్టు తేలింది. ఈ రసాయనాల మూడి పదార్థాలు వైద్య సంబంధిత మందుల తయారీలో ఉపయోగించనున్నారు. ఇక్కడ మూడు గోడౌన్లు ఉండగా, తొలి గోడౌన్, రెండో గోడౌన్‌లలో తొమ్మిదిన్నర గంటల సమయంలో మంటల్ని అదుపులోకి తెచ్చారు. 

అయితే, మూడో గోడౌన్‌లోనే అత్యధికంగా మందులు ఉండటంతో మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఆ గౌడౌన్‌ యజమాని రంజిత్‌ సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఆయన వద్ద పోలీసులు విచారించారు.

 చెన్నై కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టెట్రా కార్బన్, డై సల్పయిడ్‌ వంటి 24 రకాల రసాయానాలు వందలాది బేరల్స్‌లో ఇక్కడ ఉన్నట్టు విచారనలో తేలిందని అగ్నిమాపక శాఖ డీజీపీ శైలేంద్ర బాబు తెలిపారు.

 అందుకే మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు వీరోచితంగా శ్రమిస్తున్నట్టు తెలిపారు. స్కై లిఫ్ట్‌ వాహనాల్ని రంగంలోకి దించడం ద్వారా రెండు గోడౌన్లలో మంటలు అదుపులోకి వచ్చాయన్నారు

ఉవ్వెత్తున ఎగసి పడుతున్న మంటలకు తోడుగా, దట్టమైన పొగ ఆ పరిసరాల్ని చుట్టుముట్టింది. దీంతో ఆ గౌడౌన్‌కు సమీపంలో ఉన్న వాళ్లందర్నీ ఖాళీచేయించారు.  పొగ క్రమంగా వ్యాపించడంతో ఆ పరిసర వాసులు ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.