ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇద్దరు మంత్రులు, ఐదుగురు ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆఫీసుకు కార్యకర్తలు పోటెత్తారు. ఈ ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్‌కు విషయం అందించగానే.. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడంతోపాటు కొవిడ్ నిబంధనలనూ పాటించలేదని గౌతమ్ పల్లి పోలీసు స్టేషన్‌లో అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

లక్నో: అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీకి మంత్రులు సహా ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అందులో ఇద్దరు మంత్రులు, ఐదుగురు ఎమ్మెల్యేలు ఈ రోజు సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) చీఫ్ అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) సమక్షంలో శుక్రవారం పార్టీలో చేరారు. ఓ బీజేపీ మంత్రి రాజీనామా చేయగానే ఆయనపై 2014 ఎన్నికలకు ముందు చేసిన కొన్ని వ్యాఖ్యల ఆధారంగా నమోదైన కేసులో అరెస్టు వారెంట్ జారీ అయింది. తాజాగా, సమాజ్‌వాదీ పార్టీపైనే ఎఫ్ఐఆర్ నమోదైంది. 

ఎన్నికల కోడ్, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. గౌతమ్ పల్లి పోలీసు స్టేషన్‌లో పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ నుంచి వీడిన ఇద్దరు మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ సైనీలతోపాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున కార్యకర్తలు గుమిగూడారు. సమాజ్‌వాదీ పార్టీ వర్చువల్ ర్యాలీ ముందస్తు అనుమతులు తీసుకోకుండానే నిర్వహించారని లక్నో జిల్లా మెజిస్ట్రేట్ అభిషేక్ ప్రకాశ్ తెలిపారు.

ఈ నిబంధనల ఉల్లంఘనల గురించి సమాచారం అందగానే ఓ పోలీసు టీమ్ సమాజ్‌వాదీ పార్టీ ఆఫీసుకు వెళ్లిందని ఆయన వివరించారు. వారి రిపోర్టు తీసుకున్న తర్వాత.. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర రాజధాని లక్నలో 144 సెక్షన్ అమలులో ఉన్నదని పేర్కొన్నారు. కాగా, ఈ ఎఫఐఆర్‌పై సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ యూనిట్ చీఫ్ నరేష్ ఉత్తమ్ పటేల్ స్పందించారు. ఇది తమ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వర్చువల్ కార్యక్రమం అని వివరించారు. తాము ఎవరినీ ఇందుకు పిలువలేదని తెలిపారు. కానీ, ప్రజలే వారంతట వారే వచ్చేశారని పేర్కొన్నారు. వారంతా కొవిడ్ నిబంధనలకు లోబడే ఉన్నారని వివరించారు.

ఇలా ప్రజా సమూహాలు.. బీజేపీ మంత్రుల డోర్‌స్టెప్‌ల దగ్గర కూడా ఉన్నాయని, మార్కెట్లలోనూ గుమిగూడిన ఘటనలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కానీ, వారికి కేవలం తమతో మాత్రమే సమస్య అని ఆరోపించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నందున ప్రత్యక్ష ర్యాలీలను ఎన్నికల సంఘం నిషేధిస్తూ జనవరి 8న ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

బీజేపీ నుంచి తమ పార్టీలోకి వలసలు పెరుగుతున్న తరుణంలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ .. పుండు మీద కారం చల్లినట్టుగా బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయ‌న శుక్ర‌వారం లక్నోలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఉత్త‌రప్ర‌దేశ్ బీజేపీ లో వికెట్లు టపటపా పడిపోతున్నాయ‌ని ఎద్దేవా చేశారు. అస‌లు బాబా ( సీఎం యోగి ఆదిత్యనాథ్) కీ క్రికెట్ ఎలా ఆడాలో తెలియడం లేద‌ని, ఇప్పుడు క్యాచ్ వదిలేశారని అన్నారని వ్యంగ్య ఆస్త్రాలు విసురుతున్నారు. మూడ్రోజుల వ్యవధిలో ముగ్గురు మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేయడం పట్ల ఆయన పైవిధంగా స్పందించారు.