ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ వరుస పెట్టి వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇప్పటికే సత్యం రామలింగరాజు నిజ జీవితం ఆధారంగా వెబ్‌సిరీస్‌ను రూపొందించి కోర్టులు చుట్టూ తిరుగుతోంది. ఈ నేపథ్యంలో నెటిఫ్లిక్స్‌ మరోసారి చిక్కుల్లో పడింది.

ఇటీవల విడుదలైన ‘ఏ సూటబుల్‌ బాయ్‌’ సిరీస్‌లో హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు నెటిఫ్లిక్స్ ప్రతినిధులపై భారతీయ యువ మోర్చా జాతీయ కార్యదర్శి గౌరవ్ తివారీ మధ్యప్రదేశ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అంతేగాక పవిత్ర దేవాలయంలో ముద్దు సీన్‌లు చిత్రీకరించి మనోభావాలు దెబ్బతీసినందుకు నెట్‌ఫ్లిక్స్‌ హిందువులకు క్షమాపణ చెప్పాలని తివారీ డిమాండ్ చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో నర్మదా నది ఒడ్డున ఉన్న మహేశ్వర ఆలయంలో ఈ ముద్దు సన్నివేశాలు చిత్రీకరించారని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నమని తివారి ధ్వజమెత్తారు. అంతేగాక ఇది లవ్ జిహాద్‌ను కూడా ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు.

గౌరవ్ తివారీ ఫిర్యాదు మేరకు నెట్‌ఫ్లిక్స్‌ కంటెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మోనికా షెర్గిల్‌, పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ అంబికా ఖురాలనా ఐపీసీ 295 సెక్షన్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరొత్తం మిశ్రా తెలిపారు.

అయితే ఈ వివాదంపై నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిధులు ఇంకా స్పందించ లేదు. కాగా ‘ఏ సూటబుల్‌ బాయ్‌’ వెబ్‌ సిరీస్‌లో సీనియర్ నటి టబు కూడా నటించారు.

ఇందులో టబుకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు సైతం అభ్యంతరకరంగా ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ‘ఏ సూటబుల్‌ బాయ్‌’ సిరీస్‌కు మీరా నాయర్ దర్శకత్వం వహించారు.