ఏషియానెట్ న్యూస్ రిపోర్టర్ పై కొచ్చి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తప్పుపట్టారు. ఈ ఉదంతం.. రాష్ట్రంలో సీపీఎం ప్రభుత్వ కపటం, వైరుధ్యాలను వెల్లడించిందని పేర్కొన్నారు. బీబీసీ డాక్యుమెంటరీ సందర్భంగా భావ ప్రకటన గురించి లెక్చర్లు ఇచ్చిన సీపీఎం నేతలు ఇప్పుడు వైఖరి మార్చుకున్నారని విమర్శించారు.
న్యూఢిల్లీ: కేరళలో సీపీఎం సారథ్యంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మంగళవారం విమర్శలు గుప్పించారు. ఏషియానెట్ న్యూస్ చీఫ్ రిపోర్టర్ అఖిల నందకుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఆయన మాట్లాడుతూ సీపీఎం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘కమ్యూనిస్టు ప్రభుత్వం, సీపీఐ(ఎం) భావజాలం పూర్తిగా నయవంచన, వైరుధ్యాల మీద నిర్మించిన ఇల్లు వంటివి. బీబీసీ నుంచి ఒక డాక్యుమెంటరీ వచ్చినప్పుడు వారు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి భావోద్వేగంగా స్టేట్‌మెంట్లు ఇస్తారు. అదేసమయంలో వారు అధికారంలో ఉన్న కేరళలో ఒక జర్నలిస్టు దేని గురించో రిపోర్ట్ చేస్తే ఉన్నపళంగా అది భావప్రకటన స్వేచ్ఛ కాకుండా పోతుంది. వారు ఆ స్వేచ్ఛనే విస్మరిస్తారు. కేరళలోని సీపీఎం ప్రభుత్వం అబద్ధాలు, కపటత్వం మీద ఏర్పడింది’ అని అన్నారు.
కేరళలో మీడియా వర్గం ఏకమై పినరయి ప్రభుత్వ తీరును విమర్శిస్తూ అఖిలకు సంఘీభావంగా నిలిచిన తరుణంలో కేంద్ర మంత్రి పై విధంగా స్పందించారు. ప్రముఖ మలయాళి మీడియా సంస్థలు మలయాళం మనోరమా, మాతృభూమి, మాధ్యమం, కేరళ కౌముది వంటి సంస్థలు ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
Also Read: ఆత్మహత్య.. రాజద్రోహం! ఉత్తరకొరియాలో ఏకంగా కుటుంబాలే సూసైడ్, కిమ్ అత్యవసర సమావేశాలు
ఇది చైనా కాదు.. ఉత్తర కొరియా కాదు. పార్టీ సెక్రెటరీ అహంకారం పార్టీకే పరిమితం కావాలని మనోరమా ఫ్రంట్ పేజ్‌లో కథనం ప్రచురించింది. రాష్ట్రంలో నియంతృత్వ పోకడలు కనిపిస్తున్నాయని మాతృభూమి రిపోర్ట్ చేసింది.
సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రెటరీ పీఎం అర్షో ఫిర్యాదుపై కొచ్చి పోలీసులు ఏషియానెట్ రిపోర్టర్ అఖిలపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మహారాజ కాలేజీ మార్కుల లిస్టుకు సంబంధించిన వివాదంపై కేసు ఫైల్ అయింది. అందులో ఇతరులతోపాటు ఏషియానెట్ న్యూస్ రిపోర్టర్‌నూ పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మీడియా ప్రతినిధులు ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
