Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై కేసు నమోదు ... ఎందుకోసమో తెలుసా?

కర్ణాటక ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యపైనే కేసు నమోదయ్యింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుటుంబానికి భారీ లబ్ది చేకూర్చారనేది ఆయనపై అభియోగాలు.

FIR against Karnataka CM Siddaramaiah in MUDA land scam AKP
Author
First Published Sep 27, 2024, 5:33 PM IST | Last Updated Sep 27, 2024, 8:01 PM IST

 కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై పోలీస్ కేసు నమోదయ్యింది. ఆయన సతీమణి పార్వతిపైనా మైసూరు లోకాయుక్త స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదుచేసారు. మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలోని సొంత భూమి పరిహారం విషయంలో సీఎం అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణల నేపథ్యంలో విచారణకు కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో సీఎం సిద్దరామయ్య దంపతులపై కేసు నమోదు చేసారు పోలీసులు. 

అసలు సిద్దరామయ్యపై పెట్టిన కేసు ఏమిటి? 

కర్ణాటకలోకి ప్రముఖ నగరం  మైసూరులో సీఎం సిద్దారామయ్య భార్య పార్వతి పేరిట కొంత భూమి వుండేది. ఈ భూమిని ఆమె సోదరుడు అంటే సిద్దరామయ్య బామ్మర్ది మల్లికార్జున్ గిప్ట్ గా ఇచ్చాడు. ఇక్కడివరకు అంతా బాగానే వుంది. కానీ ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వెనకే గోల్ మాల్ జరిగిందనే ఆరోపణలున్నాయి. 

సిద్దరామయ్య భార్యకు ఆమె సోదరుడు బహుమతిగా ఇచ్చిన 3.16 ఎకరాల భూమిని మైసూరు నగరపాలక అభివృద్ది సంస్థ (MUDA) స్వాధీనం చేసుకుంది. ఇందుకుగాను వేల కోట్ల విలువైన 14 ప్లాట్లను ఆమెకు ఇచ్చారు... సీఎం కుటుంబానికి లాభం చేసేందుకే చట్ట విరుద్దంగా పరిహారం అందించారనేది ప్రతిపక్షాల వాదన. సుమారు రూ.4000 కోట్ల విలువైన ప్లాట్లను సిద్దరామయ్య భార్యకు ప్రభుత్వం అప్పగించిందని బిజెపి ఆరోపిస్తోంది. 

ఆర్టిఐ కార్యకర్తలు స్నేహమయి కృష్ణ, అబ్రహంలు సిద్దరామయ్య భూ వ్యవహారాన్ని బైటపెట్టారు. వీరు       కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గేహ్లాట్ కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారు. ఈ ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. కానీ గవర్నర్ నిర్ణయాన్ని సమర్దించిన న్యాయస్థానం ఈ నెల (సెప్టెంబర్) ఆరంభంలోనే దర్యాప్తుకు అనుమతిచ్చింది. 

 ఏ1 గా సిద్దరామయ్య : 

మైసూర్ నగరపాలక సంస్థ భూ వ్యవహారంలో సిద్దరామయ్య అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అధికార బలంలో భార్య పార్వతి కోల్పోయిన భూమికంటే ఎక్కువ విలువైన స్థలాలను దక్కించుకోగలిగారట. కాబట్టి ఈ వ్యవహారంలో సీఎం సిద్దరామయ్యనే ఈ కేసులో ఏ1 గా చేర్చారు. 

ఇక సీఎం సిద్దరామయ్య భార్య పార్వతిని ఏ2గా, బామ్మరిది మల్లికార్జున్ ను ఏ3గా, దేవరాజ్ అనే మరో వ్యక్తిని ఏ4గా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. లోకాయుక్త  అధికారి సమక్షంలో దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు సూచించింది ప్రత్యేక న్యాయస్థానం. సిఆర్పిసి సెక్షన్ 156(సి) కింద విచారణ చేపట్టాలని ... డిసెంబర్ 24 లోపు దర్యాప్తు నివేదికను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 

సిద్దరామయ్యకు కాంగ్రెస్ మద్దతు : 

తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై నమోదయిన కేసుపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే స్పందించారు. సిద్దరామయ్యకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా వుంటుందన్నారు. ప్రస్తుతం ఆయనపై వున్నవి కేవలం ఆరోపణలు మాత్రమే... ఆయన దోషిగా తేలలేదు కదా అని అన్నారు. ఏ తప్పు చేయలేదు కాబట్టే ఆయన న్యాయపోరాటాకి సిద్దమయ్యారని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. 

సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా చేయాలన్న ప్రతిపక్ష బిజెపి నాయకుల డిమాండ్ పైనా ఖర్గే రియాక్ట్ అయ్యారు. గతంలో నరేంద్ర మోదీపై గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండగా గోద్రా అల్లర్ల ఆరోపణలు వచ్చాయి...అప్పుడు ఆయన రాజీనామా చేసారా? అని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై కూడా అనేక కేసులు వున్నాయి... చాలామంది కేంద్రమంత్రులు, బిజెపి సీఎంలపై కూడా కేసులున్నారు.. వాళ్లంతా రాజీనామాలు చేస్తున్నారా అంటూ ఖర్గే ఎదురుదాడి చేసారు.

వాల్మికి కుంభకోణం :

ఇప్పటికే సిద్దరామయ్య సర్కార్ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇటీవల బైటపడ్డ వాల్మీకి స్కాం కర్ణాటక కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టింది. ఇటీవల పార్లమెంట్ ఎన్నికలకు ముందు 180 కోట్ల ప్రభుత్వ నిధులు దారిమళ్లాయి. దీంతో రంగంలోకి దిగిన ఈడి ఈ నిధులు గోల్ మాల్ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. 

గిరిజన బిడ్డల సంక్షేమానికి కేటాయించిన నిధులను సిద్దరామయ్య సర్కార్ దారిమళ్లించి ఎన్నికల కోసం వాడుకుందనే ఆరోపణలున్నాయి.    కర్ణాటకతో పాటు తెలంగాణలోని పలు పార్లమెంట్ స్థానాల్లో ఈ డబ్బులను ఉపయోగించారని  ఈడి చార్జ్ షీట్ లో పేర్కొంది. ఈ స్కాంలో మాజీ మంత్రి నాగేంద్రను ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్నా ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం వుందనేది బిజెపి ఆరోపణ. 


 
 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios