ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ సత్యజిత్ రే రూపొందించిన పథేర్ పాంచాలి అనే సినిమాను ఆల్ టైమ్ బెస్ట్ ఇండియన్ ఫిల్మ్‌గా ఎంపిక చేసింది. ఈ సినిమా 1955లో విడుదల అయ్యింది.
లెజెండరీ ఫిల్మ్ మేకర్ సత్యజిత్ రే రూపొందించిన ‘పథేర్ పాంచాలి’ చిత్రం ఆల్ టైమ్ బెస్ట్ ఇండియన్ ఫిల్మ్‌గా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ (FIPRESCI) ప్రకటించింది. 1955 లో విడుదలైన ఈ చలనచిత్రం భారతీయ సినిమా చరిత్రలో టాప్ పది చిత్రాలలో మొదటి స్థానాన్ని పొందింది. ఫిప్రెస్కీ ఇండియన్ చాప్టర్ నిర్వహించిన ఎన్నికల తరువాత దీనిని ప్రకటించింది.
ఫిప్రెస్కీ ఇండియా విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ఈ ఎన్నికలు రహస్యంగా నిర్వహించారు. ఇందులో 30 మంది సభ్యులు పాల్గొన్నారు. కాగా. ఈ చిత్రం 1929లో బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన పథేర్ పాంచాలి పేరుతోనే రాసిన బెంగాలీ నవల ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాలో సుబీర్ బెనర్జీ, కను బెనర్జీ, కరుణా బెనర్జీ, ఉమా దాస్‌గుప్తా, పినాకి సేన్‌గుప్తా, చునిబాలా దేవి నటించారు.
ఈ అవార్డు కోసం పోటీ పడిన చిత్రాల జాబితాలో రిత్విక్ ఘటక్ 1960లో రూపొందించిన బెంగాలీ డ్రామా చిత్రం 'మేఘే ధాకా తార', మృణాల్ సేన్ హిందీ డ్రామా చిత్రం 'భువన్ సోమ్' (1969), అదూర్ గోపాలకృష్ణన్ మలయాళ డ్రామా చిత్రం 'ఎలిప్పటయం' (1981), 1977లో విడుదలైన చిత్రం గిరీష్ కాసరవల్లి 'ఘటశ్రాద్ధ' (కన్నడ), 1973లో విడుదల అయిన ఎంఎస్ సత్యు చిత్రం 'గర్మ్ హవా' (హిందీ), 1964లో విడుదలైన రే చిత్రం 'చారులత' (బెంగాలీ), 1974లో విడుదల అయిన శ్యామ్ బెనెగల్ చిత్రం 'అంకుర్' (హిందీ), 1954లో విడుదల అయిన గురుదత్ చిత్రం 'ప్యాసా' (హిందీ), రమేష్ సిప్పీ దర్శకత్వం వహించిన హిందీ బ్లాక్ బస్టర్ 'షోలే' (1975) పోటీ పడ్డాయి.
