భారత రూపాయి పతనంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రూపాయి బలహీనపడటం లేదు లేదని.. అయితే అమెరికా డాలర్ బలపడుతోందని పేర్కొన్నారు.

భారత రూపాయి పతనంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రూపాయి బలహీనపడటం లేదు లేదని.. అయితే అమెరికా డాలర్ బలపడుతోందని పేర్కొన్నారు. రూపాయి పతనాన్ని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శాయశక్తులా కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాలో అధికారిక పర్యటనలో ఉన్న సీతారామన్‌ వాషింగ్టన్ డీసీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 

రాబోయే రోజుల్లో రూపాయికి ఎదురయ్యే సవాళ్లు ఏమిటి అని ఒక విలేఖరి నిర్మలా సీతారామన్‌ను అడిగారు. రూపాయి మరింతగా క్షీణించకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఇందుకు సమాధానమిచ్చిన నిర్మలా సీతారామన్.. ‘‘మొదట రూపాయి పడిపోతున్నట్లు నేను చూడలేదు.. కానీ అమెరికా డాలర్ బలపడుతున్నందున నేను దానిని చూస్తున్నాను. డాలర్ బలపడుతున్నందున వేళ.. సహజంగా ఇతర కరెన్సీలు దానితో పోలిస్తే బలహీనంగా ఉంటాయి. ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలతో పోల్చితే భారత రూపాయి మంచి పనితీరు కనబరుస్తోంది. అయితే రూపాయి పతనాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ శాయశక్తులా ప్రయత్నిస్తోంది’’ అని చెప్పారు. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ అస్థిరత లేకుండా చూసుకోవడంపై దృష్టి పెట్టిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. భారతీయ కరెన్సీ విలువను నిర్ణయించడానికి మార్కెట్‌లో జోక్యం చేసుకోలేదని తెలిపారు. 

ఇదిలా ఉంటే.. సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో యూఎస్ డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.68 వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. గురువారం US డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.24 వద్ద స్థిరపడింది. విదేశాల్లో స్థిరమైన గ్రీన్‌బ్యాక్, క్రూడాయిల్ ధరల స్లైడింగ్ మధ్య శుక్రవారం యుఎస్ డాలర్‌తో రూపాయి 8 పైసలు పడిపోయి 82.32 వద్ద ముగిసింది.