ఇటీవలి కాలంలో చిన్న చిన్న కారణాలు, గొడవలకే హత్యల దాకా వెళుతున్నారు జనాలు. మద్యం కోసమే, వంట బాలేదనో, స్నేహితుడు తిట్టాడనో ఇలా కారణం ఏదైనా అయినవారి ప్రాణాలను తీసేస్తున్నారు. తాజాగా చిన్న చికెన్ ముక్క కోసం ఓ యువతిని యువకుడు హత్య చేశాడు.

వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని కోయంబేడు‌లో ఓ పెద్ద పూల మార్కెట్ ఉంది... అనేక ప్రాంతాల నుంచి ఇక్కడకు భారీ ఎత్తున పూలు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు వస్తుంటారు.

దీంతో తెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరకు ఈ మార్కెట్ రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో యువతి, యువకుడు పూలు కొనడానికి వచ్చారు. ఆకలిగా ఉండటంతో అక్కడికి దగ్గరలోని ఓ హోటల్ నుంచి బిర్యానీ కొనుక్కుని తింటున్నారు.

అయితే తాను తింటున్న బిర్యానీలో ఒక్క చికెన్ ముక్క కూడా రాలేదని అమ్మాయి.. అబ్బాయిని అడిగింది. ఈ విషయంలో మాటామాటా పెరిగి వారిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

కోపంతో ఊగిపోతున్న అబ్బాయి తన దగ్గర ఉన్న కత్తి తీసి గొంతు కోశాడు. దీంతో ఆ యువతి గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే మరణించింది. ఆమె అరుపులు విన్న వ్యాపారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.

అయితే వారిని గమనించిన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.