కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి తన రాజకీయ వారసుడిగా కుమారుడు నిఖిల్‌ పోలిటికల్ ఎంట్రీకి సీనియర్ నటి సుమలత అడ్డు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న మాండ్య లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ దివంగత నటుడు, రెబల్‌స్టార్ అంబరీష్ భార్య సుమలతపై ఆయన అభిమానులు ఒత్తిడి తెస్తున్నారు.

ఇటీవలే మాండ్యలో జరిగిన అంబరీష్ సంస్మరణ సభలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సుమలతను రాజకీయాల్లోకి రావాలని కోరారు. ఇందుకు కుమారు అభిషేక్ సైతం మద్ధతు పలికారు. అయితే ముఖ్యమంత్రి కుమారస్వామి తన వారసుడిగా నిఖిల్‌ను మాండ్య నుంచి పోటీ చేయించాలని పావులు కదుపుతున్నారు.

ఇరువురు మనవళ్లను ఒకేసారి రాజకీయాల్లోకి తీసుకువస్తానని దేవెగౌడ గతంలోనే వెల్లడించారు. అయితే సుమలత కనుక రంగంలోకి దిగితే నిఖిల్ ఎంట్రీ అనుమానమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంబరీష్ కుటుంబానికి, కుమారస్వామి కుటుంబానికి వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలున్నాయి.

రాజకీయాల కోసం ఆ బంధాన్ని దూరం చేసుకోకూడదని కుమారస్వామి భావిస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోంది. సుమలత, నిఖిల్‌లు ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనుకుంటే పోటీ చేసే స్థానంపై చర్చలు జరిగే అవకాశం ఉందని బెంగళూరు టాక్.