డీప్ ఫ్రీజర్ లో పెట్టి శిశువు మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతున్న దారుణ సంఘటన యూపీలో జరిగింది. అలీగఢ్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణం అని తేలింది. 

ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డెలివరీ అయిన మహిళకు పుట్టిన శిశువు కొద్దిసేపటికే మృతిచెందింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆ మృతశిశువును ఆసుపత్రిలోని డీప్ ఫ్రిజర్‌లో ఉంచారు. తెల్లారి శిశువును ఖననం చేసేందుకు సిద్ధమైన కుటుంబ సభ్యులు మృతదేహం కోసం వెళ్లారు. ప్రీజర్ లో ఉన్నశిశువు మృతదేహంలోని కొన్ని భాగాలను ఎలుకలు కొరికి తినేశాయి. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతవైద్యాధికారులు సదరు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై దర్యాప్తునకు ఆదేశించారు. 

అలీగఢ్‌కు చెందిన రాజేష్ కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తన భార్య దేవిని నవంబరు 22న కీర్తి ఆసుపత్రిలో డెలివరీ కోసం జాయిన్ చేశానని, అదే రోజు రాత్రి 11 గంటలకు ఆమె ఆడపిల్లకు జన్మినిచ్చిందని తెలిపారు. తరువాత ఆ శిశువు మృతిచెందడంతో తమకు చూపించి, తీసుకుపోయారని తెలిపారు. 

మర్నాడు తమకు ఆ శిశువు మృతదేహాన్ని అప్పగించారని, అయితే ఆ శిశువు మృతదేహన్ని ఎలుకలు కొరికివేసిన విషయాన్ని తాము గమనించామని తెలిపారు. ఈ విషయమై తాము ఆసుపత్రి సిబ్బందిని అడగగా, వారు నిరక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎంఓ డాక్టర్ బీపీ సింగ్ మాట్లాడుతూ ఆ శిశువు మృతదేహాన్ని ఎలుకలు కొరికాయా లేదా అనే దానిపై విచారణ చేపట్టనున్నామని తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక ఈ విషయం తెలుస్తుందన్నారు.