తాను కేసీఆర్, స్టాలిన్ లతో మాట్లాడానని మమతా బెనర్జీ చెప్పారు. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెసుతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేవని ఆమె అన్నారు. ప్రాంతీయ పార్టీల ఐక్యతను ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిపారు.
కోల్ కతా: తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెసు పార్టీకి షాక్ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తో మాట్లాడిన తర్వాత ఆమె కాంగ్రెసు మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏ ప్రాంతీయ పార్టీతోనూ కాంగ్రెసుకు సత్సంబంధాలు లేవని, కాంగ్రెసును దానంతటది వెళ్లాల్సిందేనని ఆమె అన్నారు.
దేశం ఫెడరల్ నిర్మాణాన్ని రక్షించడానికి బిజెపియేతర ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయడానికి కేసీఆర్, స్టాలిన్ లతో ఆమె ఆదివారంనాడు మాట్లాడారు. ఈ సమావేశానికి కాంగ్రెసును ఆహ్వానించడం లేదని ఆమె సోమవారంనాడు స్పష్టం చేశారు. ఏ ప్రాంతీయ పార్టీకి కూడా కాంగ్రెసుతో సత్సంబంధాలు లేవని, కాంగ్రెసు దానంతటది పనిచేసుకుంటూ వెళ్తుందని, తాము తమంత తాము పనిచేసుకుంటామని ఆమె వివరించారు.
బిజెపికి వ్యతిరేకంగా కలిసి రావాలని తాను కాంగ్రెసును, వామపక్షాలను అడిగానని, కానీ వారు వినడం లేదని దీదీ అన్నారు. పశ్చిమ బెంగాల్ లో వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెసు బద్ధశత్రువులుగా వ్యవహరిస్తుననారు. దాంతో జాతీయ స్థాయిలో వామపక్షాలను కలుపుకుని వెళ్లడానికి ఆటంకం ఏర్పడుతోంది.
దేశం ఫెడరల్ నిర్మాణాన్ని ధ్వంసం చేస్తున్నారని, దేశ రాజ్యాంగాన్ని దెబ్బ తీస్తున్నారని, వాటిని రక్షించుకోవడానికి తామంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తాను కేసీఆర్, స్టాలన్ లతో మాట్లాడిన విషయాన్ని ప్రస్తావిస్తూ అన్నారు.
తాము ఫెడరల్ వ్యవస్థను కాపాడడానికి ప్రయత్నిస్తున్నామని, ఈ స్థితిలో అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. తమిళనాడులో కాంగ్రెసు, డిఎంకెల మధ్య పొత్తు ఉన్న విషయం తెలిసిందే.
బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్ష శక్తులను ఏకం చేయడానికి తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుస్తానని కేసీఆర్ ఆదివారంనాడు చెప్పారు. బిజెపికి వ్యతిరేకంగా వివిధ ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా వారిని కలుస్తానని ఆయన చెప్పారు. మమతా బెనర్జీ తనకు ఫోన్ చేసి చర్చించినట్లు కూడా ఆ.యన తెలిపారు. తనను మమతా పశ్చిమ బెంగాల్ కు ఆహ్వానించారని, మమతా అయినా హైదరాబాద్ వస్తారని ఆయన అన్నారు.
