భర్త చేతితో మెడలో తాళి కట్టించుకున్న నాటి నుంచి ఎన్నో అవమానాలు, వేధింపులు, తిట్లు, చివాట్లు భరించింది. ఒక ఆమెలో ఓపిక నశించింది. అందుకే భర్తకు తిరగబడింది. తనలో ఉన్న భాధని కోపంగా మార్చుకొని కట్టుకున్నవాడిని కడతేర్చింది. అనంతరం భర్త తలను మొండాన్ని వేరుచేసింది. అతని తలను పట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ధైర్యంగా చంపింది తానేనని చెప్పింది. ఈ సంఘటన అస్సాంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అస్సాం లఖింపూర్‌ జిల్లాకు చెందిన గుణేశ్వరి బర్కతకి(48) భర్త ముధిరం(55). వీరికి ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. పైళ్లైన నాటి నుంచి భర్త.. గుణేశ్వరిని చిత్ర హింసలకు గురి చేస్తుండేవాడు. తిట్టడం, కొట్టడమే కాక కత్తి, గొడ్డలి వంటి మారణాయుధాలతో కూడా దాడి చేసేవాడు. 

ఇన్నాళ్లు భర్త ఆగడాలను భరించిన గుణేశ్వరికి.. ఓపిక నశించింది. దాంతో భర్త మీద కత్తితో దాడి చేసి చంపేసింది. అనంతరం అతని తలను వేరు చేసి.. ఓ ప్లాస్టిక్‌ కవర్‌లో వేసుకుని.. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఇన్ని సంవత్సరాలు తాను తన పిల్లల కోసమే భర్తను భరిస్తూ వచ్చినట్లు ఆమె తెలిపింది. నేడు కూడా తాను భర్తపై ఎదురు తిరగకపోయి ఉంటే.. తన ప్రాణాలు పోయేవని ఆమె కన్నీటి పర్యంతమైంది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారిస్తున్నారు.