Margaret Alva: న‌వ భార‌తంలో 'బిగ్ బ్రదర్' ఎప్పుడూ దేశ రాజకీయ నాయకుల మధ్య సంభాషణలను వింటాడు.. వారి క‌ద‌లిక‌లు చూస్తాడ‌ని ప్ర‌తిప‌క్షాల ఉప‌రాష్ట్రప‌తి అభ్యర్థి మార్గరెట్ అల్వా అన్నారు. ఈ త‌ర‌హా భ‌యం దేశంలో ప్ర‌జాస్వామ్యాన్ని చంపేస్తోంద‌ని పేర్కొన్నారు.  

Vice presidential candidate Margaret Alva: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారును టార్గెట్ చేస్తూ.. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'బిగ్ బ్రదర్' రాజకీయ నాయకుల ఫోన్‌లను ట్యాప్ చేస్తున్నారని, వారిలో ఈ భయం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తోందని అన్నారు. "బిగ్ బ్రదర్ ఎప్పుడూ చూస్తుంటాడు.. వింటాడనే భయం న్యూ ఇండియాలో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకుల మధ్య అన్ని సంభాషణలకు ఇది వ‌ర్తిస్తుంది. అందుకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీల నాయకులు బహుళ ఫోన్‌లను కలిగి ఉంటారు.. తరచుగా నంబర్‌లు మార్చుకుంటారు, అలాగే, వారు భౌతికంగా కలిసినప్పుడు గుసగుసలాడుకుంటారు. ఈ భ‌యం ప్ర‌జాస్వామ్యాన్ని చంపేస్తుంది" అని మార్గ‌రెట్ అల్వా ట్వీట్‌ చేశారు.

Scroll to load tweet…

అలాగే, మ‌రో ట్వీట్ లో కేంద్ర ఆధీనంలో ఉన్న ప్ర‌భుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ పై ప‌లు ఆరోప‌ణ‌లు గుప్పించారు. బీఎస్ఎన్ఎల్ ను ట్యాగ్ చేస్తూ.. తన ఫోన్ కాల్స్ ను మళ్లించారని ఆరోపించారు. "ఈరోజు బీజేపీలోని కొంతమంది స్నేహితులతో మాట్లాడిన తర్వాత, నా మొబైల్‌కి కాల్‌లు అన్నీ మళ్లించబడుతున్నాయి.. నేను కాల్‌లు చేయలేను లేదా స్వీకరించలేను. మీరు నా ఫోన్ కాల్స్ ను పునరుద్ధరిస్తే.. నేను ఈ రాత్రికి BJP, TMC లేదా BJDకి చెందిన ఏ ఎంపీకి కాల్ చేయనని హామీ ఇస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

మార్గ‌రెట్ అల్వా ట్వీట్ నేప‌థ్యంలో BSNL ఈ విషయంలో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. "మార్గరెట్ అల్వా దాఖలు చేసిన ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోబడ్డాయి. ఈ విషయంలో BSNL ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది" అని టెలికాం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆల్వా ఆరోపణలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ "ఎవరైనా ఆమె ఫోన్‌ను ఎందుకు ట్యాప్ చేయాలి? ఆమె ఎవరికైనా కాల్ చేయనివ్వండి. ఉప‌రాష్ట్రప‌తి ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందనే దానిపై మాకు నమ్మకం ఉంది. మనం ఎందుకు ఇలా చేయాలి? ఇవి చిన్నపిల్లల ఆరోపణలు. ఆమె సీనియర్‌ వ్యక్తి కాబట్టి అలాంటి ఆరోపణలు చేయకూడదు అని పేర్కొన్నారు.