ఓ వ్యక్తి తన కూతురికి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో మ్యాట్రిమోనియల్ సైట్ నుంచి కొంత మంది పురుషుల వివరాలను సేకరించాడు. వాటిని తన కూతురికి పంపి.. ఇందులో నచ్చినవారిని తనకు చెప్పాలని కోరాడు. కానీ, ఆ కూతురి అందరిలో తన తండ్రితో వాదులాడకుండా.. ఆ వ్యక్తుల ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియెన్స్ కనుక్కుని తన స్టార్టప్ కంపెనీలో పనిచేస్తారా? అంటూ మెసేజీలు పంపింది. అంతే ఈ విషయం తన తండ్రి తెలుసుకుని కూతురిపై ఫైర్ అయ్యాడు. ఆ తండ్రి కూతుళ్ల చాటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
న్యూఢిల్లీ: తమ పిల్లలకు మంచి జీవిత భాగస్వామిని తల్లిదండ్రులు ఆరాటపడుతారు. వీలైన అన్ని దారుల్లో వారు మంచి వరుడు లేదా వధువుల వివరాల కోసం జల్లెడ పడుతుంటారు. తమ పిల్లలు యుక్త వయసుకు రాగానే పెళ్లి చేసుకునే ఈడు వచ్చేలోగా వారికి మంచి జీవిత భాగస్వామిని వెతికిపట్టే పనిలో మునిగిపోతారు. తమ పిల్లలకు సరిపడే తోడు కోసం బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరినీ అడిగి పెడతారు. మంచి పిల్లాడిని వెతకాలని, తన కుమార్తెకు పెళ్లి చేయాలని చెబుతారు. కొందరేమో మ్యాట్రిమోనియల్ సైట్స్‌లో తమ పిల్లల వివరాలు పొందుపరుస్తారు. అందులో నచ్చిన వ్యక్తుల కోసం వెతుకులాడుతుంటారు. అయితే, ఇలాగే, ఓ వ్యక్తి తన కుమార్తె కోసం మ్యాట్రిమోనియల్ నుంచి కొంత మంది వరుళ్ల వివరాలను సేకరించి జాబితా తయారు చేశాడు. ఆ వివరాలను తన కూతురుకు పంపించాడు. కానీ, ఆ తర్వాత ఆయన కుమార్తెకు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.
ఆమె చేసిన పనికి ఇంటర్నెట్‌లో తీవ్రమైన రచ్చ మొదలైంది. ఆమె మ్యాట్రిమోనియల్ సైట్‌ను పెళ్లి కోసం కాకుండా సరికొత్తగా వినియోగించుకుంది. తన స్టార్టప్ కంపెనీలో ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి మంచి అనుభవం ఉన్నవారిని రిక్రూట్ చేసుకోవడానికి వాడుకుంది. ఔను.. తన తండ్రి పంపిన వరుడి వివరాలను చూసి.. ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ చూసి తన స్టార్టప్ కంపెనీలో ఉద్యోగానికి కుదురుతావా? అని అడిగింది. రెజ్యూమె పంపించాలని, ఇంటర్వ్యూ లింక్ కూడా ఆయనకు పంపింది. ఆ తర్వాత విషయం ఆ యువతి తండ్రికి తెలిసింది. ఆయన తన వాట్సాప్ ద్వారా కూతురిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వరుడికి రెజ్యూమె పంపాలని, ఆ తర్వాత ఇంటర్వ్యూ లింక్ పెట్టినట్టు తన తండ్రికి తెలిసిన తర్వాత తనకు పంపిన వాట్సాప్ మెసేజీలను ఆ యువతి ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఆ చాటింగ్ ఇప్పుడు వైరల్ అయింది.
తన తండ్రి ఆవేశంతో పంపిన మెసేజీలు వరుసగా ఇలా ఉన్నాయి.. మనం ఇప్పుడు మాట్లాడాలి.. అర్జెంట్.. అసలు నువ్వే చేశావో నీకు తెలుసా? మ్యాట్రిమోనియల్ సైట్ నుంచి నీవు మనుషులను రిక్రూట్ చేసుకోవద్దు.. ఇప్పుడు నేను వారి తండ్రికి ఏం సమాధానం చెప్పాలి?.. నువ్వు ఆయనకు పంపిన మెసేజీలు నేను చూశాను. ఇంటర్వ్యూ లింక్ వేశావ్... రెజ్యూమ్ పంపాలని అడిగావ్.. సమాధానం చెప్పు పిచ్చి పిల్ల అంటూ ఫైర్ అయ్యాడు. అందుకు ఆ యువతి కూల్‌గా తనదైన విధానంలో సమాధానం చెప్పింది.
హె.. హె.. అని నవ్వుతూ తన చాటింగ్ మొదలు పెట్టింది. ఏడు సంవత్సరాల ఫిన్‌టెక్ అనుభవం అంటే చాలా మంచిది నాన్న.. అందుకే మేం ఆయనను రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నాం అంటూ కూల్‌గా సమాధానం చెప్పింది.
ఆ యువతి ట్విట్టర్ హ్యాండిల్ పేరు ఉదిత్ పాల్ అని ఉన్నది. ఆమె ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సరళతరం చేయాలనే లక్ష్యంగా స్థాపించిన సాల్ట్ పే స్టార్టప్‌కు సహ వ్యవస్థాపకురాలు. ఆయన ఏడాదికి 62 లక్షల జీతం ఆశిస్తున్నాడని, తాము అంత ఇచ్చుకోలేమని ఆమె మరో ట్వీట్‌లో కామెంట్ చేసింది. ఈ వ్యవహారం తర్వాత తన పేరును మ్యాట్రిమోనియల్ సైట్ నుంచి తండ్రి తొలగించాడని వివరించింది. ఆ తర్వాత.. ఈ ఘటనపై తనను ద్వేషించొద్దని, తాను సులువుగా ఏడుస్తానని కామెంట్ చేసింది. ఆమె ట్వీట్‌కు చాలా మంది నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. వారు కూడా తాము ఎదుర్కొన్న మ్యాట్రిమోనియల్ అనుభవాలను పంచుకున్నారు.
