తన ఆరేళ్ల కొడుకును దారిలో పెట్టడానికి డిసిప్లీన్‌గా పెంచడానికి ఆ తండ్రి ఓ పథకం వేశాడు. రోజంతా తన కుమారుడి కోసం ఓ షెడ్యూల్ తయారు చేశాడు. ఆ షెడ్యూల్ ఫాలో అయితే, రోజుకు రూ. 10 ఇస్తానని హామీ ఇచ్చాడు. అదే ప్రవర్తన వారం మొత్తం కనిపిస్తే రూ. 100 ఇస్తానని డీల్ కుదుర్చుకున్నాడు. ఫన్నీగా ఉన్న ఆ డీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
న్యూఢిల్లీ: చిన్న పిల్లలు అల్లరి చేస్తారు. అది సహజం. వారి నైజం కూడా. కానీ, వారిని దారిలో పెట్టడానికి అంటే డిసిప్లిన్ చేయడానికి ఒక్కోరు ఒక్కో విధానాన్ని ఎంచుకుంటారు. కొందరు పనిష్‌మెంట్ విధానాన్ని ఎంచుకుంటే మరికొందరు రివార్డ్ విధానాన్ని ఎంచుకుంటారు. అంటే.. పిల్లలను భయంతో లేదా దెబ్బలతో లేదా ఇతర శిక్షలతో వారిని దారిలో పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇంకొందరు వారికి రివార్డులు ప్రకటిస్తూ దారిలోకి తెస్తారు. అంటే.. చెప్పినట్టు నడుచుకుంటే.. బహుమానం ఇవ్వడం లాంటిదన్నమాట. ఈ ప్రైజులతో వారిని గాడిలో పెడతారు. ఓ ట్విట్టర్ యూజర్ కూడా ఇదే దారిని ఎంచుకున్నాడు. పక్కా షెడ్యూల్ ప్రిపేర్ చేసి దాన్ని ఫాలో అయితే.. రోజుకు రూ. 10 ఇస్తానని ఆరేళ్ల కొడుకుతో తండ్రి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదే సత్ప్రవర్తన వారం మొత్తం కొనసాగిస్తే రూ. 100 ఇస్తానని పేర్కొన్నాడు. ఈ ఒప్పంద పత్రంపై తండ్రి తనయులు సంతకం పెట్టారు. ఆ ఒప్పంద పత్రాన్ని ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ షెడ్యూల్ ఇప్పుడు వైరల్ అవుతున్నది.
ఆ షెడ్యూల్ పర్ఫెక్ట్‌గా ఉండటంతోపాటు కొంత ఫన్నీగానూ ఉన్నది. ఆ పిల్లాడి షెడ్యూల్ ఉదయం 7.50 గంటలకు మొదలవుతుంది. అలారం 7.50 మోగుతుందని, లేవడం పది నిమిషాల తర్వాత అంటే 8.00 గంటలకు లేవాలని ఉన్నది. అంటే.. అలారం మోగగానే సాధారణంగా పిల్లలు ‘నాన్న మరో పది నిమిషాలు’ అని గోముగా అడుగుతారు కదా. దాని కోసం ఆ తండ్రి ముందుగానే ఆ పది నిమిషాలను టైం టేబుల్‌లో చేర్చాడు.
బ్రష్ చేసుకోవడానికి, స్నానం చేయడానికి 20 నిమిషాలు కేటాయిస్తే.. బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయడానికి 30 నిమిషాలు ఇచ్చాడు. ఆడుకునే సమయం, టీవీ వీక్షించడానికి, క్లీనింగ్ చేసుకోవడానికి, హోం వర్క్‌కు అన్నింటికీ సమయాన్ని కేటాయించాడు.
ఇలా రోజంతా అల్లరి చేయకుండా, ఏడవకుండా, విసిగించకుండా ఉంటే ఆ రోజు రూ. 10 ఇస్తానని రివార్డు ప్రకటించాడు. అది కేవలం ఏడకుండా ఉండటానికే కాదని, ఆయన డిసిప్లీన్ మొత్తానికీ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నాడు. ఆ ఒప్పంద పత్రంపై చివరలో తండ్రి పేరుతోపాటు ఆరేళ్ల కొడుకు అబిర్ సంతకం పెట్టారు. బాట్లా జీ అనే యూజర్ ఈ డీల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
