కూతురు సంతోషంగా జీవించాలని ఘనంగా పెళ్లి చేశారు. భారీగా కట్న కానుకలు కూడా ముట్టచెప్పారు. కూతురు సంతోషంగా ఉంటుందని భావించారు. కానీ... అత్తారింట్లో కూతురు శవంగా మారింది. కూతురు చనిపోయిందన్న విషయాన్ని ఆమె అత్తారింటివారు ఫోన్ చేసి చెప్పారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ... కూతురిని కడసారి చూసుకోవాలని ఆత్రుతగా వెళ్లిన తండ్రికి నిరాశే ఎదురైంది.

 కడసారి చూసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అంత్యక్రియలు నిర్వహించేశారు. కానీ ఆ తండ్రి మాత్రం ఊరుకోలేదు. చితిలో కాలిపోతున్న కూతురి శవంలోని చేతిని లాగి... దానిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. ఈ సంఘటన బిహార్ రాష్ట్రం పాట్నాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బిహార్ రాష్ట్రంలోని చంపారణ్ జిల్లాకు చెందిన రామనాథ్ రామ్ తన కుమార్తె సంగీతా దేవికి బుట్కన్ రామ్ అనే వ్యక్తికి ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం జరిపించాడు. కాగా... రెండు రోజుల క్రితం ఆమె చనిపోయిదంటూ రమనాథ్ రామ్ కి సమాచారం అందింది. అతను కూతురు అత్తారింటికి చేరుకునే సమయానికి ఆమె అంత్యక్రియలు కూడా నిర్వహించేశారు.

చితిలో కాలిపోతున్న కూతురి చేతిని బయటకు తీసి... దానిని తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. కూతురిని అత్తారింటి వారు దారుణంగా హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.