కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన కన్న కూతుళ్ళపై కన్నేసిన ఓ కామాంధుడు కన్నూమిన్నూ కానకుండా వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ అమానుషం మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది.
గ్వాలియర్: కామంతో కళ్లు మూసుకుపోయి కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన కన్న కూతుళ్లపైనే అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఇలా సభ్యసమాజం తలదించుకునేలా, మానవ సంబంధాలకు మచ్చలా నిలిచే ఈ అమానుషం మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... మధ్య ప్రదేశ్ (madhya pradesh) రాష్ట్రంలోని గ్వాలియర్ సమీపంలోకి ఓ గ్రామంలో భార్యాభర్తలు ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసముండేవారు. అయితే కన్న కూతుళ్లకు రక్షణగా వుండాల్సిన తండ్రే వారిపై కన్నేసాడు. కామంతో కన్నూమిన్ను కానక ఇద్దరు కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఏడాది క్రితమే పెద్ద కూతురుపై అత్యాచారానికి పాల్పడగా నెల రోజుల క్రితం ఇంట్లో నిద్రిస్తున్న చిన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఈ కీచకుడు. అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న కూతురువద్దకు వెళ్లి అరవకుండా నోరు మూసి అతి క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ కసాయి తండ్రి. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. కానీ బాలిక ఉదయం తల్లితో తనపై తండ్రి చేసిన అఘాయిత్యం గురించి తెలిపింది.
ఈ దారుణం గురించి చెల్లి తల్లికి చెప్పిన సమయంలో అక్కడేవున్న పెద్దకూతురు కూడా తనపై జరిగిన అత్యాచారం గురించి బయటపెట్టింది. తనపై కూడా ఏడాది క్రితమే తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడని...ఎవరికీ చెప్పవద్దని బెదిరించడంతో భయంతో బయటపెట్టలేదని తెలిపింది.
కట్టుకున్నవాడే కామాంధుడిలా మారి ఇద్దరు కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడటాన్ని ఆ తల్లి తట్టుకోలేకపోయింది. వెంటనే ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సదరు కామాంధున్ని అరెస్ట్ చేసారు.
చిన్నారులిద్దరికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఇద్దరిపైనా అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో కన్న కూతుళ్లపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధున్ని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. విచారణ జరిపిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి 21 ఏళ్ల జైలుశిక్ష, రూ9వేల జరిమానా విధించింది.
ఇదిలావుంటే ఇటీవల తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి దారుణం చోటుచేసుకుంది. మల్లంపేట్‌లో ఓ బాలికపై మారు తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీంతో బాలిక తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
మల్లంపేటలో ఓ జంట 10 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. మహిళతో సహజీనం చేస్తున్న అతడు ఆమె మైనర్ కూతురిపై కన్నేశాడు. బాలికను లోబర్చుకుని పదే పదే బాలికపై అత్యాచారం చేశారు. ఇలా మారు తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతో బాలిక గర్భం దాల్చింది. అయితే ఇటీవల బాలిక అనారోగ్యంతో ఉండగా.. తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షించగా.. బాలిక గర్భవతి అని తేలింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మారు తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడినట్టుగా బాలిక తెలిపింది. దీంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది.
