సారాంశం

ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బుధవారం ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది .  అయితే తన కుమారుడు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడని.. అతని తండ్రి కె చందర్ వాదించారు .  మా బాబుని ఐఐటీలో ఎందుకు బాధపెట్టారు అంటూ మీడియా ముందు వ్యాఖ్యానించారు.  

ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బుధవారం ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీంతో దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలో అకడమిక్ ఒత్తిడిని మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో నాలుగో సంవత్సరం చదువుతున్న కె కిరణ్ చంద్ర తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని కనిపించాడని ఐఐటీ ఖరగ్‌పూర్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తన కుమారుడు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడని.. అతని తండ్రి కె చందర్ వాదించారు. అయినా అక్కడ ఎందుకంత ఒత్తిడి వుంది.. మా బాబుని ఐఐటీలో ఎందుకు బాధపెట్టారు అంటూ మీడియా ముందు వ్యాఖ్యానించారు. తన కొడుకు ర్యాగింగ్‌కు గురయ్యాడని తాను అనుకోవడం లేదని, అయితే చదువుల వల్ల చాలా ఒత్తిడికి లోనవుతున్నాడని చందర్ అన్నారు. 

లాల్ బహదూర్ శాస్త్రి (ఎల్‌బీఎస్)లో హాల్ ఆఫ్ రెసిడెన్స్‌లో చంద్ర బస చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు ఐఐటీ తెలిపింది. సాయంత్రం 7.30 గంటల వరకు .. చంద్ర తన ఇద్దరు రూమ్‌మేట్స్‌తో కలిసి హాస్టల్ గదిలో వున్నాడు. తర్వాత ఇద్దరు విద్యార్ధులు బయటకు వెళ్లారు. ఈ క్రమంలో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఎల్‌బీఎస్ హాల్‌లోని తోటి విద్యార్ధులు .. చంద్ర లోపలి నుంచి తాళం వేసుకున్నట్లు గుర్తించారు.

ALso Read: IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య..

దీనిపై అనుమానం వ్యక్తం చేసిన వారు తలుపులు బద్ధలుకొట్టి చూడగా.. చంద్ర ఉరికి వేలాడుతూ కనిపించాడు. వైద్యులు అతని ప్రాణాలు  కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ.. మంగళవారం రాత్రి 11.30కి చంద్ర మరణించినట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రకటించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. ఏడాది క్రితం అస్సాంకు చెందిన ఫైజాన్ అహ్మద్ మృతదేహం 2022 అక్టోబర్ 14న హాస్టల్ గదిలో కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఫైజాన్ మూడో సంవత్సరం చదువుతున్నారు. అయితే ఫైజాన్ ఆత్మహత్య చేసుకున్నాడని.. ఐఐటీ యాజమాన్యం చెప్పింది. కానీ కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు మృతదేహానికి రెండోసారి పోస్ట్‌మార్టం నిర్వహించారు. తమ బిడ్డ క్యాంపస్‌లో హత్యకు గురయ్యాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.