ఓ అమ్మాయి ప్రేమ నుంచి తమ కుమార్తెను రక్షించాలని కోరుతూ... ఓ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఆమె మోజులో పడి తమ కుమార్తె సరిగా చదవడం లేదని... ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  మదురై జిల్లాకు చెందిన ఆనంద్(44)  ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు ఓ కుమార్తె ఉంది. ఆమె చెన్నైలోని బంధువుల ఇంట్లో ఉంటూ.. కుట్టుపనులు నేర్చుకుంటోంది. కాగా... అక్కడ ఆమెకు మరో యువతితో పరిచయం ఏర్పడింది. వారి ఇద్దరి మధ్య ప్రేమ కూడా మొదలైంది. ఈ విషయం ఆనంద్ తెలియడంతో కంగారు పడిపోయాడు. సదరు యువతితో తన కుమార్తె స్వలింగ సంపర్కానికి పాల్పడుతోందని తెలిసి అతను షాకయ్యాడు.

దీంతో ఆమెను రక్షించాలని కోరుతూ మంగళవారం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అందులో తన కుమార్తె (17) చదువు సరిగా రాలేదని దీంతో చెన్నై సైదాపేటలోని బంధువుల ఇంటిలో ఉంచినట్లు తెలిపారు. అక్కడ ఆమె గత కొన్ని నెలలుగా నుంగంబాక్కంలోని ఒక ప్రైవేటు శిక్షణ కేంద్రంలో దుస్తుల తయారీ నేర్చుకుంటోందన్నారు. ఈ సమయంలో అక్కడున్న మరో యువతితో పవిత్రకు స్వలింగ సంపర్క సంబంధం ఏర్పడినట్లు తెలిసింది.

దీంతో ఆమె గత కొన్ని రోజుల క్రితం సైదాపేట బంధువుల ఇంటి నుంచి అదృశ్యమైందన్నారు. ఆమె కోసం గాలిస్తున్న స్థితిలో అన్నానగర్‌ వెస్ట్‌ ప్రాంతంలోని ఒక సంస్థలో పవిత్ర కౌన్సెలింగ్‌ పొందుతున్నట్లు తాజాగా తెలిసింది. గత కొన్ని రోజుల క్రితం ఆ సంస్థతో తన కుమార్తెను పంపాలని కోరినా వారు నిరాకరించారన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకొని తన కుమార్తెను రక్షించాలని కోరారు. తిరుమంగళం పోలీసులు కేసు నమోదు చేసి బాలికతో సంబంధమున్న మరో యువతిని విచారణ చేస్తున్నట్లు తెలిసింది.