తమకు ఇష్టం లేకుండా కుమార్తె వేరే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుందని ఓ తండ్రి రాక్షసుడిగా మారాడు. కన్న కూతురిపైనే కక్ష కట్టాడు. కూతురినే చంపేందుకు ప్రయత్నించాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లా, తిరుమంగళం సమీపం నాగయ్యపురానికి చెందిన వాలగురునాథన్(55) ఎరువుల వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. అతనికి డిగ్రీ చదువుతున్న కుమార్తె సుష్మ(19) ఉంది. కాగా.. సుష్మ... గత కొంతకాలంగా పక్క గ్రామానికి చెందిన శివశంకరన్(23) ని ప్రేమిస్తుంది.

వీరిద్దరి కులాలు వేరే కావడంతో వారి పెళ్లి కి పెద్దలు నిరాకరించారు. దీంతో.. ప్రేమ జంట పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. దీంతో సుష్మ తండ్రి వాలగురునాథన్‌ ఆగ్రహించాడు. ఈ క్రమంలో ప్రేమజంట నాగయ్యపురం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు ఇరు కుటుంబాల తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. సుష్మ మేజర్‌ కావడంతో ఆమెను భర్తతో పంపేందుకు సమ్మతించారు. శివశంకరన్‌ వేరే కులానికి చెందినవాడని అతన్ని ఆంగీకరించబోమని సుష్మ తల్లిదండ్రులు చెప్పారు. 

కొత్తదంపతులు శివశంకరన్‌ సొంతవూరైన వాళవందాన్‌పురంలో నివశిస్తూ వచ్చారు. గర్భిణి అయిన సుష్మ మంగళవారం ఉదయం భర్త శివశంకరన్‌తో తిరుమంగళం సమీపంలోగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పరీక్షల కోసం వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న సుష్మ తండ్రి వాలగురునాథన్‌ అక్కడికి వెళ్లి కుమార్తెతో ప్రేమగా మాట్లాడుతూ కత్తితో ఆమెపై దాడి చేశాడు. 

ఆమె కేకలు విన్న భర్త శివశంకరన్‌ పరుగున వచ్చి కత్తి లాక్కుని భార్యను కాపాడాడు. సుష్మకు ప్రాథమిక చికిత్స చేసి తర్వాత మెరుగైన చికిత్సల కోసం తిరుమంగళం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. భర్త శివశంకరన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమంగళం పోలీసులు వాలగురునాథన్‌ను అరెస్టు చేశారు.