కంటికి రెప్పలా కాపాడాల్సిన కూతురిపైనే ఓ వ్యక్తి కన్నేశాడు. కన్న కూతురనే కనికరం కూడా లేకుండా ప్రవర్తించాడు. ఈ విషయం తెలిసినప్పటికీ ఆమె సవతి తల్లి ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ అభాగ్యురాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వివరాల్లోకి వెళితే.. ఓ 19 ఏళ్ల యువతి తన తండ్రి(40), సవతి తల్లితో కలిసి బెంగళూరులో నివశిస్తోంది. అయితే కన్నతండ్రే ఆమెపై కన్నేశాడు. మంగళవారం దగ్గు, జలుబుతో ఆమె బాధపడుతుండడంతో ఇదే అదనుగా తీసుకున్నాడు. కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చి వేసుకోమన్నాడు. 

తండ్రి పాడు బుద్ధి గురించి ఏమాత్రం తెలియని ఆమె అమాయకంగా వాటిని వేసుకుంది. కొద్ది సేపటికే మైకం కమ్మి నిద్రలోకి జారిపోయింది. ఉదయం లేచేసరికి తాను అత్యాచారానికి గురైనట్లు తెలుసుకుంది. అది కూడా తన తండ్రే తనపై అత్యాచారం చేశాడన్న నిజాన్ని ఆమె నమ్మలేకపోయింది. వెంటనే సవతి తల్లి వద్దకు వెళ్లి ఈ విషయాన్ని చెప్పి వాపోయింది. 

అయితే ఆమె ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. టాయిలెట్లు శుభ్రం చేసే బిళ్లలను మింగేసింది. అయితే తనపై అత్యాచారం చేసిన తండ్రికి మాత్రం ఎలాగైనా శిక్ష పడేలా చేయాలని అనుకుంది. వెంటనే దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్నంతా చెప్పి అక్కడే కుప్పకూలిపోయింది. 

పోలీసులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో తండ్రిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. సవతి తల్లిపై కూడా విచారణ జరుగుతోందని వివరించారు.