కన్నతండ్రే కుమారుడిని అత్యంత పాశవికంగా హతమార్చాడు. సీసీటీవీ ఫుటేజ్‌లో అతని దారుణం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా పెందుర్తి శివారు చిన్నముసిడివాడలో వీర్రాజు అతని కుమారుడు బలరాజు నివసిస్తున్నారు.

తండ్రితో కలిసి వుంటున్న బలరాజు ఇటీవల చిన్నముసిడివాడలోనే సొంతంగా ఇల్లు నిర్మాణం చేపట్టాడు. అయితే అతని ముగ్గురు చెల్లెళ్లకు కొంత డబ్బు ఇవ్వాల్సిందిగా తండ్రి వీర్రాజు సూచించాడు.

ఇందుకు అంగీకరించిన బలరాజు... తనకు కొంత గడువు ఇవ్వాలని తండ్రిని కోరాడు. ఈ విషయమై గత కొంత కాలంగా తండ్రీకొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఇంటి ముందు పనిచేస్తున్న బలరాజును వెనుక నుంచి వచ్చిన వీర్రాజు సుత్తితో కొడుకు తలపై విచక్షణారహితంగా కొట్టాడు.

దీంతో తీవ్ర గాయాలపాలైన బలరాజును కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వీర్రాజును అరెస్ట్ చేశారు.

అయితే  కన్నకొడుకునే తండ్రి హత్య చేయడం వెనుక గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీలో హత్య చేసిన విధానం స్పష్టంగా కనిపించింది.