కోడి కూర విషయంలో ఓ వ్యక్తి ఆవేశంతో  తన కన్న కొడుకుపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో కన్న కొడుకు చనిపోయాడు.  ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జరిగింది

మద్యం మత్తు విచక్షణను కోల్పోయేలా చేసింది. మానవత్వాన్ని చంపేసింది. కోడి కూర కోసం కన్న కొడుకును అత్యంత దారుణంగా కొట్టి కడతేర్చేలా చేసింది. ఇంట్లో వండిన కోడి కూర మొత్తం తండ్రి తినేయడంతో కొడుకు గొడవ చేశారు. ఈ క్రమలంలో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం తీవ్రమై.. చివరకు ఘర్షణకు దారితీసింది.

ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన తండ్రి తన 32 ఏళ్ల కుమారుడిని కర్రతో కొట్టి చంపేశాడు.ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సులియా తాలూకాలోని మోగ్ర గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ప్రాణాలు కోల్పోయిన యువకుడిని శివరామ్‌గా గుర్తించారు. ఆయన కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన తండ్రి పేను షీనా. 

మంగళవారం రాత్రి శివరామ్ ఇంట్లో కోడి మాంసం వండగా.. కుమారుడికి వదిలి పెట్టకుండా అతని తండ్రి పేను షీనా మొత్తం తినేశాడు. ఈ విషయమై శివరామ్‌ తన తండ్రితో గొడవ పడ్డాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి.. గొడవకు దారి తీసింది. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి షీనా.. పక్కనే ఉన్న దుడ్డుకర్ర తీసుకుని కుమారుడు శివరామ్ తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడి శివరామ్ అక్కడికక్కడే చనిపోయాడు.

సమాచారం అందుకున్నపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గురించి తెలియగానే ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసును పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్టు చేశారు. దీంతో పాటు అతని కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు. ఇంతకుముందు ఇంట్లో జరిగిన గొడవలపై మృతుడి భార్య, పిల్లలను కూడా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన వల్ల ఇద్దరు పిల్లలు తండ్రి ప్రేమకు దూరమయ్యారు.

ఛత్తీస్‌గఢ్‌లో కూడా అలాంటి ఉదంతం

గతేడాది డిసెంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఓ విచిత్రమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. లలిత్‌పూర్‌లోని నోనియాతంగార్‌లో ఒక స్నేహితుడు కోడి కూర కోసం తన స్నేహితుడిని కడతేర్చాడు. చికెన్ తినే విషయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం బాగా పెరిగి ఒక స్నేహితుడు మరో స్నేహితుడిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు.