చెన్నై: కట్టుకున్న భార్యపై అనుమానంతో కన్న బిడ్డను అతి కిరాతకంగా హతమార్చాడు ఓ కసాయి భర్త. తన పోలికలు ఏ మాత్రం లేవని... అసలు ఆ బిడ్డ తనకు పుట్టలేడంటూ ఎనిమిది రోజుల పసిగుడ్డును నేలకేసి కొట్టి చంపాడు. మానవత్వానికే మచ్చతెచ్చే ఈ దారుణం తమిళనాడులో చోటుచేసుకుంది. 

పోలీసులు, బాదిత కుటుంబం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని కడలూరుకు చెందిన ఏలుమలై లారీ డ్రైవర్. అతడికి శివరంజని అనే యువతితో పెళ్లయింది. వీరిద్దరి వివాహ బంధానికి సాక్ష్యంగా ఈ నెల 10వ తేదీన ఓ పండటి బిడ్డ  జన్మించాడు. అయితే అప్పటికే భార్య శివరంజనిపై అనుమానం పెంచుకున్న భర్త బిడ్డ తన పోలికలతో లేడని గొడవ పెట్టుకున్నాడు. ఇలా బిడ్డ పుట్టినప్పటి నుండి భార్యను వేధిస్తూవస్తున్న ఏలుమలై దారుణానికి ఒడిగట్టాడు.  

 గురువారం రాత్రి బిడ్డను చూసేందుకు అత్తారింటికి వచ్చాడు ఏలుమలై. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన భర్త కన్న బిడ్డ అని కూడా చూడకుండా పసిగుడ్డును అమాంతం పైకెత్తి నేలకేసి కొట్టాడు. దీంతో పాపం ఆ పసిప్రాణం అక్కడికక్కడే పోయింది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బిడ్డ తండ్రి ఏలుమలైని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భర్త కసాయితనానికి పసిబిడ్డ బలవడంతో ఆ తల్లి కన్నీటిపర్యంతం అవుతోంది.