పరువు, ప్రతిష్ట, అనుమానం, భయం ఇవి ఎంతటి వారినైనా మూర్ఖులుగా మారుస్తాయి. కన్నబిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి కూతురిని దారుణంగా హత్య చేశాడు. సోదరి తన అభ్యంతరాన్ని పట్టించుకోకుండా మరోవ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోవడంతో తన కుమార్తె కూడా అలాగే చేస్తుందని అతను భావించినట్లు దర్యాప్తులో తేలింది.

వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్ మహసముంద్ జిల్లాకు చెందిన సంతోష్ దివాన్‌ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో అతని సోదరి ఇంట్లోవారి అభ్యంతరాలను పట్టించుకోకుండా కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయింది.

Also Read:అఫైర్ అనుమానం: భార్యకు వేయిబోయి తాను ఉరేసుకున్న భర్త

దీనిని అవమానంగా భావించిన సంతోష్‌కు నాటి నుంచి ఇది మనసులో బలంగా నాటుకుపోయింది. దీంతో తన 19 ఏళ్ల కూతురు కూడా ఇలాగే చేస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చాడు.

తన బిడ్డ ప్రేమలో పడిందేమోనని, చెడు తిరుగుళ్లు తిరుగుతుందేమోనని భావించిన అతను ఆమె క్యారెక్టర్‌ను అనుమానించసాగాడు. ఇది తీవ్ర రూపం దాల్చడంతో తన బిడ్డ ఫోన్‌ మాట్లాడినా, బయటికి వెళ్లినా అతనిని అనుమానం వెంటాడేది.

ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి ఓ రోజు ఫోన్ వాడుతుండగా ఎవరితో ఛాటింగ్ చేస్తున్నావంటూ నిలదీశాడు. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరగడంతో చివరికి ఆమె ఇంట్లో నుంచి కోపంతో బయటకు వెళ్లిపోయింది.

Also read:పీరియడ్స్ అని చెప్పి దూరం పెట్టింది.. రెండు వారాల తర్వాత..

అప్పటికీ వదలని సంతోష్ ఆమెను వెంబడించి మరీ పట్టుకున్నాడు. కూతురు తలపై బండరాయితో మోది దారుణంగా చంపాడు. ఆమె చనిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయి తనకు ఎలాంటి సంబంధం లేనట్లు ప్రవర్తించాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే సంతోష్ ప్రవర్తనపై అనుమానం రావడంతో అతనిని తమదైన శైలిలో ప్రశ్నించగా తన బిడ్డను తానే చంపినట్లు అంగీకరించాడు.