తమిళనాడులో దారుణం జరిగింది. 17 రోజుల తన కన్నకూతురిని ఓ వ్యక్తి సజీవ సమాధి చేసి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. విల్లుపురం జిల్లా వడమరుతూర్ గ్రామానికి చెందిన వరదరాజన్ అనే రైతు.. సుందరేసుపురం గ్రామానికి చెందిన సౌందర్యను 15 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు.

ఇతను కుటుంబంతో కలిసి అతండమరుతూర్‌లోని తమ పొలంలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలోని పుదుచ్చేరిలోని జిప్మెర్ ఆసుపత్రిలో 17 రోజుల క్రితం సౌందర్య ఆడబిడ్డకు జన్మనివ్వడంతో వరదరాజన్ నిరాశ చెందాడు.

మంగళవారం మధ్యాహ్నం సౌందర్య తన బిడ్డకు పాలు ఇచ్చి నిద్రపోతుండగా వరదరాజన్ ఆమెను తన ఇంటి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న తెన్నెన్నై నదీతీరానికి తీసుకెళ్లాడు. అనంతరం అక్కడ ఒక గొయ్యి తవ్వి బిడ్డను సజీవంగా పాతిపెట్టాడు.

Also read:కూతురిని చంపిన తండ్రి.. చితకగొట్టిన గ్రామస్థులు

ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 4 గంటలకు సౌందర్య నిద్రమేల్కొని పక్కపై తన బిడ్డ లేకపోవడంతో కంగారు పడింది. వెంటనే సహాయం కోసం ఆమె కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని శిశువు కోసం గాలించారు.

అందరూ వరదరాజన్‌పైనే అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. విచారణలో అతను తన బిడ్డను చంపినట్లుగా నేరాన్ని అంగీకరించాడు. అనంతరం రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీసులు శిశివు మృతదేహాన్ని వెలికితీశారు.

Also read:అక్కడ ఆడపిల్లకు జన్మనిస్తే రూ.8లక్షలు గిఫ్ట్

కాగా.. తమకు కుమారుడు పుడతాడనే నమ్మకం ఉందని.. ఒకవేళ తన భార్య ఆడబిడ్డకు జన్మనిస్తే బిడ్డను ప్రాణాలతో ఉంచనని ముందుగానే చెప్పానని వరదరాజన్ వెల్లడించాడు. అంతా తెలిసి కూడా ఇప్పుడు తన భార్యతో పాటు బంధువలంతా ప్లేట్ ఫిరాయించారని అతను వ్యాఖ్యానించాడు.

వరదరాజన్‌పై సెక్షన్ 302 (హత్య), సెక్షన్ 315 (చిన్నారిని సజీవంగా పూడ్చినందుకు) అలాగే సెక్షన్ 498 ఎ (గృహహింస) ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

కొద్దిరోజుల క్రితం కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆడపిల్ల అనే కారణంతో నెలల పసికందుని ఓ తండ్రి తన చేతులతో తానే హత్య  చేశాడు. రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టిందనే కారణంతోనే నీటితోట్టిలో పడేసి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.

కాగా.. తండ్రి సూర్యతేజను గ్రామస్థులు పట్టుకున్నారు. కూతురిని చంపుతావా అంటూ... అతనిని అతి దారుణంగా చితకగొట్టారు. దారుణంగా కొట్టి... అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా... బిడ్డ చనిపోయినందుకు తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.