సర్పదోష నివారణా పూజల పేరిట ఓ వివాహితపై అత్యాచారానికి పథకం పన్నిన తండ్రి, కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బాణసవాడికి చెందిన ఓ మహిళ.. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అయితే భర్తతో విభేదాల కారణంగా అతనికి దూరంగా ఉంటోంది.

ఈ క్రమంలో తన జీవితంలో కష్టాలకు సర్పదోషమే కారణమని భావించిన ఆమె సన్నిహితుల ద్వారా కామస్వామి గణేశ్, అతని కుమారుడు మణికంఠను సంప్రదించింది. దోష నివారణకు ఐదుసార్లు తాళికట్టించుకుని, ఐదు సార్లు లైంగిక ప్రక్రియలో పాల్గొనాలని కామస్వామి మహిళతో చెప్పాడు.

ఈ నెల 7న తండ్రికొడుకులు రాత్రి 10 నుంచి 11 గంటల వరకు మహిళ ఇంట్లో పూజలు నిర్వహించారు. అనంతరం పూజ చేసిన వస్తువులను కుక్కే సుబ్రమణ్యలో వదలాలని ఆమెకు చెప్పారు.

అదే సమయంలో కామస్వామి, మణికంఠ.. కుక్కేలో వేరువేరు గదులు బుక్‌ చేసుకుని మహిళపై అత్యాచారం చేయాలని పథకం వేశారు. దీనిని పసిగట్టిన బాధితురాలు కుటుంబసభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామస్వామి గణేశ్, అతని కుమారుడు మణికంఠను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.