ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది చనిపోయారు. మరి కొందరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెర్హంపూర్-తప్తపాణి రోడ్డులో దిగపహండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. అయితే క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం బెర్హంపూర్ లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీకి తరలించారు.
వివరాలు ఇలా ఉన్నాయి. బెర్హంపూర్ లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన పలువురు ఓ ప్రైవేట్ బస్సులో తమ గమ్యస్థానం అయిన ఖండౌలీకి తిరిగి వస్తున్నారు. అయితే ఆ బస్సు దిగపహండి ప్రాంతానికి చేరుకోగానే ఓఎస్ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 7 గురు ఉన్నారు. పలువురికి గాయాలు అయ్యాయి.
ప్రమాదంలో గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఎంకేసీజీ మెడికల్ కాలేజీకి తరలించినట్లు గంజాం దిబ్యా జ్యోతి పరిదా జిల్లా మేజిస్ట్రేట్ విలేకరులకు తెలిపారు. క్షతగాత్రులను ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘రెండు బస్సులు ఢీకొనడంతో 10 మంది మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంకేసీజీ మెడికల్ కాలేజీకి తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని దిబ్యా జ్యోతి పరిదా విలేకరులతో చెప్పారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రక్షించి వైద్య కేంద్రానికి తరలించినట్లు ఎస్పీ తెలిపారు. గంజాం జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో క్షతగాత్రులకు చికిత్స కోసం రూ.30 వేల చొప్పున మంజూరు చేసినట్లు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ తెలిపారు.
కాగా.. ఈ ఘటనపై సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు.
