మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి.. 25 మందికి గాయాలు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దతియా జిల్లా సెవ్రాలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మరో 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దతియా జిల్లా సెవ్రాలో సాయంత్రం భింద్ జిల్లా నుంచి యాత్రికులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ట్రాలీ వంతెనపై నుంచి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దటియా పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ట్రాక్టర్ ట్రాలీలో మహిళలు, పిల్లలతో కలిపి 38 మంది ఉన్నారని ‘టైమ్స్ నౌ’ కథనం పేర్కొంది. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పలువురిని రక్షించారు. ఘటనా స్థలానికి అంబులెన్స్‌లు చేరుకున్నాయి. క్షతగాత్రులకు అక్కడే ప్రాథమిక చికిత్స అందించి, వారందరినీ దతియా మెడికల్ కాలేజీకి తరలించారు.
ప్రమాదంలో గాయపడిన వారందరినీ అంబులెన్స్‌లో ద్వారా దతియా మెడికల్ కాలేజీతో పాటు గ్వాలియర్ జిల్లా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘ దాటియాలో ట్రాక్టర్-ట్రాలీ బోల్తా పడిన ప్రమాదంలో పలువురు చనిపోయారనే విచారకరమైన వార్త అందింది. చనిపోయిన వారి ఆత్మలకు భగవంతుడు శాంతిని ప్రసాదిస్తారు. మృతుల కుటుంబాలకు ఈ తీవ్ర నష్టాన్ని భరించే శక్తిని ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుతున్నాను.’’ అని ఆయన పేర్కొన్నారు.