Bhubaneswar: ఒడిశాలోని జాజ్ పూర్ లో రెండు ట్రక్కులు ఢీకొని ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. జాజ్ పూర్ లోని ధర్మశాల పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూల్ పూర్ సమీపంలోని 16వ నెంబ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది.  

Jajpur Road Accident: రెండు ట్రక్కులు ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. కోల్‌కతా వైపు వెళ్తున్న ట్రక్కు ఆగి ఉన్న మ‌రో ట్రక్కును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదం ఒడిశాలో చోటుచేసుకుంది. కేసు నమోదుచేసుకుని విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఒడిశాలోని జాజ్ పూర్ లో శనివారం రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. జాజ్ పూర్ లోని ధర్మశాల పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూల్ పూర్ సమీపంలోని 16వ నెంబ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఏడుగురితో కోల్ కతా వెళ్తున్న ట్రక్కు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందార‌ని పోలీసులు తెలిపారు. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ‌వారిని వెంట‌నే ఆస్ప‌త్రి త‌ర‌లించారు. అయితే, కటక్ లోని ఎస్సీబీ వైద్యకళాశాలకు చికిత్స పొందుతున్నమరొకరు మృతి చెందార‌ని వైద్యులు వెల్ల‌డించారు. తీవ్ర గాయాలు కావ‌డంతో ఆయ‌న ఆరోగ్యం క్షీణించి మ‌ర‌ణించార‌ని చెప్పారు. ఈ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు పశ్చిమబెంగాల్ కు చెందిన వారిగా అంచ‌నాకు వ‌చ్చిన‌ట్టు ఎస్డీపీవో సంజోయ్ పట్నాయక్ తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ధర్మశాల పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

అయితే, ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృత‌దేహాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామ‌నీ, పోస్టుమార్టం జజ్ పూర్ లోని బరాచనా సీహెచ్ సీలో నిర్వహిస్తామని ఎస్డీపీవో తెలిపారు. 

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోనూ.. 

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. సిద్ధి జిల్లాలో రోడ్డు పక్కన ఆగి ఉన్న మూడు బస్సులను ట్రక్కు ఢీకొనడంతో 15 మంది మృతి చెందగా, 61 మంది తీవ్రంగా గాయపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ర్యాలీ నుంచి తిరిగి వస్తున్న వారిని ఈ బస్సుల్లో తీసుకెళ్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మృతులు, క్షతగాత్రులంతా సిద్ధి జిల్లాకు చెందినవారే. ఇప్పటి వరకు ఐదు మృతదేహాలను గుర్తించలేదు. మృతుల్లో హాస్టల్ సూపరింటెండెంట్ కూడా ఉన్నారు. గాయపడిన వారిలో పది మంది ఉపాధ్యాయులు, ఏడుగురు పట్వారీలు కూడా ఉన్నారు. ఓ పోలీసు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ శుక్రవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ప్రయాణికులను చేర్చిన రేవాలోని సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా 39 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతుండగా, ఐసీయూ వార్డులో ఉన్న ఐదారుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష ఇస్తామ‌ని తెలిపారు.