ఘోర రోడ్డు ప్రమాదం.. కారు, వ్యాన్ ఎదురెదురుగా ఢీ.. నలుగురు మృతి.. ఆరుగురికి గాయాలు..
తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, వ్యాన్ ఎదురుదెరుగా ఢీకొనడంతో నలుగురు మరణించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

తమిళనాడులోని చెయ్యూరు తాలూకాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు, వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చెంగల్పట్టు, చెయ్యూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించి, అక్కడ చికిత్స అందిస్తున్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి. మధురంతకం వన్నార్ పేట ప్రాంతానికి చెందిన పురుషోత్తమన్ (36) తన కారులో నలుగురు స్నేహితులైన వెంకటేశన్, గురుమూర్తి, పూవరసన్, రఘు తో కలిసి చెంగల్పట్టు ఎల్లై అమ్మన్ ఆలయానికి వెళ్లారు. అక్కడ దర్శనం చేసుకున్న అనంతరం కారులో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు.
అదే సమయంలో కాంచీపురం జిల్లా ఉత్తిరమేరూర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ ఎక్స్ పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు ఓ వ్యాన్ లో ప్రయాణిస్తున్నారు. అయితే ఆ కారు, ఈ వ్యాన్ చెయ్యూరు తాలూకాకు చేరుకునే సరికి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పురుషోత్తమన్, అతడి స్నేహితులు వెంకటేశన్, గురుమూర్తి, పూవరసన్ అక్కడికక్కడే మరణించారు. రఘుకు తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే వ్యాన్ లో ఉన్న ఐదుగురు ప్రయాణికులు కూడా గాయాలపాలయ్యారు.
దీనిపై సమాచారం అందడంతో చేరూరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వ్యాన్ డ్రైవర్, మరో నలుగురిని చికిత్స నిమిత్తం చెయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే రఘును కూడా అదే హాస్పిటల్ లో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.