న్యూఢిల్లీ: హర్యానా- ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది.  రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులు శుక్రవారం నాడు ఛలో డిల్లీకి పిలుపునిచ్చారు. అయితే ఢిల్లీలోకి అనుమతివ్వలేదు. ఢిల్లీలోకి అనుమతించేదాకా తాము ఆందోళనను విరమించబోమని రైతులు తేల్చి చెప్పారు. దీంతో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. చివరకు రైతులను ఢిల్లీలోకి అనుమతించారు పోలీసులు.

పలు రైతు సంఘాలు జేఎసీగా ఏర్పడి ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

వేలాది మంది రైతులు ఛలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ట్రాక్టర్లు, పాదయాత్ర ద్వారా ఢిల్లీ సమీపానికి ఇవాళ ఉదయానికి చేరుకొన్నారు. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసుల వాహానాలను తప్పించుకొని ఢిల్లీ వైపునకు దూసుకొస్తున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

ఢిల్లీలోకి తమకు అనుమతిని కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో రైతులను ఢిల్లీలోకి అనుమతించింది.కరోనా నిబంధనలకు ఉల్లంఘిస్తూ ఢిల్లీలోకి నిరసనకారులను అనుమతించబోమని ఢిల్లీ పోలీసులు చెప్పారు. అయితే రైతులు కూడా ఢిల్లీ నగరంలోకి అనుమతించేవరకు నిరసన కొనసాగిస్తామని చెప్పడంతో చివరకి అనుమతించాల్సి వచ్చింది.

బీహార్ ఎన్నికలకు కరోనా నియమాలు ఎందుకు పట్టించుకోలేదు. రైతుల విషయంలోనే కోవిడ్ నియామాలు గుర్తుకు వస్తున్నాయా అని రైతు నేత సింగ్ పోలీసులను ప్రశ్నించారు.ఢిల్లీలోని 9 స్టేడియాలను తాత్కాలిక జైళ్లుగా మార్చేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఢిల్లీ ప్రభుత్వం ఇందుకు నిరాకరించింది.

ఆరు రాష్ట్రాలకు చెందిన రైతులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, కేరళ, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులు ఛలో ఢీల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్నటి నుండి హర్యానా సరిహద్దుల్లోనే రైతులు రోడ్డుపైనే ఉన్నారు.

ఇవాళ ఉదయం నుండి హర్యానా -ఢిల్లీ రాష్ట్రాల సరిహద్దుల్లోని సింఘ్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.పోలీసులు, రైతులకు మధ్య పలు దఫాలు ఘర్షణ చోటు చేసుకొన్న విషయం తెలిసిందే.

నూతన వ్యవసాయ చట్టాలపై తమతో చర్చించేందుకు రావాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి  రైతు సంఘాలు లేఖలు రాశాయి.చివరికి పోలీసుల బందోబస్తు మధ్యే ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులకు పోలీసులు అనుమతించారు.