‘రైతు ఆత్మహత్యలు కొత్తేమీ కావు. కొన్నేళ్ల నుంచి జరుగుతున్నవే. నా నియోజకవర్గం సహా మహారాష్ట్రలో మరెక్కడైనా రైతు ఆత్మహత్యలు చేసుకోరాదనే కోరుకుంటాను’ అని మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ అన్నారు. 

ఔరంగాబాద్: మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ రైతు ఆత్మహత్యలు కొత్తేమీ కావని అన్నారు. రైతు ఆత్మహత్యల ఘటనలు చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నవే అని తేలికగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఔరంగాబాద్ జిల్లాలోని సిలోడ్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ మధ్య కాలంలోనే ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యల ఘటనలను ప్రస్తావిస్తూ మంత్రి అభిప్రాయాన్ని కోరుతూ విలేకరులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతూ మంత్రి అబ్దుల్ సత్తార్ పై వ్యాఖ్యలు చేశారు.

‘రైతు ఆత్మహత్యలు కొత్తేమీ కాదు. ఇలాంటి ఘటనలు కొన్నేళ్ల నుంచి జరుగుతున్నవే. నా నియోజకవర్గం సహా మహారాష్ట్రలో మరెక్కడా రైతు ఆత్మహత్యలు జరగవద్దనే కోరుకుంటాను’ అని సీఎం ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన నేత, మంత్రి సత్తార్ అన్నారు.

మార్చి 3 నుంచి 12వ తేదీ మధ్యలో సిలోడ్‌లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. కాగా, ఇదే కాలంలో మరఠ్వాడ రీజియన్‌లోని ఔరంగాబాద్‌లో కనీసం ఆరుగురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇవన్నీ రుణ సమస్యల కారణంగానే మరణించినట్టు తెలుస్తున్నది.

Also Read: ‘కిడ్నీ, లివర్ ఫర్ సేల్’.. ఇంటి బయట పోస్టర్.. ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తే షాకింగ్ నిజాలు..!

రైతు ఆత్మహత్యలపై మంత్రి అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ ఈ సమస్యలపై అగ్రికల్చర్ కమిషనర్ సారథ్యంలో ఓ కమిటీ వేస్తున్నామని, ఆ కమిటీ సమస్య మూలాలను అధ్యయనం చేస్తుందని వివరించారు. గతవారం కురిసిన అకాల వర్షానికి సిలోడ్‌లో జరిగిన పంట నష్టాన్ని మంత్రి సత్తార్ ఆదివారం సమీక్షించారు. కమిటీ సిఫారసులు అందగానే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుందని వివరించారు.