న్యూఢిల్లీ:భారత మహిళలు క్రీడలు, శాస్త్రీయ రంగాలతో పాటు ఇతర అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని ప్రధాని మోడీ ప్రశంసించారు.

ఆదివారం నాడు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఢిల్లీలో నిర్వహించిన ఐఎన్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ లో భారత్ టాప్ లో నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.అంతర్జాతీయ క్రికెట్ లో 10 వేల పరుగులు పూర్తి చేసిన భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ కి మోడీ శుభాకాంక్షలు చెప్పారు. బాడ్మింటన్ ఓపెన్ సూపర్ 300 టోర్నీలో రజత పతకం సాధించిన పీవీ సింధును ఆయన అభినందించారు.

మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకొన్నాం, అయితే ఇదేనెలలో మన దేశ మహిళలు పతకాలు, రికార్డులు సాధించడం విశేషంగా ఆయన పేర్కొన్నారు.గత ఏడాది మార్చిలో కరోనాను కట్టిడి చేసేందుకు జనతా కర్ఫ్యూను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కర్ఫ్యూ సమయంలో భారతీయులు చూపిన క్రమశిక్షణ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. దీన్ని భవిష్యత్తు తరాలు కూడ గుర్తుంచుకొంటాయన్నారు.

దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఢిల్లీలో 107 ఏళ్ల వృద్దురాలు టీకా తీసుకొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

భారత మహిళలు క్రీడలు, శాస్త్రీయ రంగాలతో పాటు ఇతర అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2022 నాటికి 75 వసంతాలు పూర్తి కానున్న నేపథ్యంలో కేంద్రం అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని తలపెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అమృత్ మహోత్సవ్ కు సంబంధించిన కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.  తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన బస్ కండక్టర్ ను మోడీ ప్రశంసించారు.కండక్టర్ గా విధులు నిర్వహిస్తూనే మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తున్న తీరు బాగుందన్నారు.ఇటీవల  విజయ్ అనే వ్యక్తి 12 ఏళ్లు శ్రమించి సముద్రం ఒడ్డున 25 ఎకరాల మడ అడవిని నిర్మించారని అభినందించారు.