కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత కొద్దిరోజులుగా దేశ రాజధానిలో రైతులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిని శాంతింపజేసేందుకు కేంద్రం పలు విడతలుగా చర్చలు జరిపింది.

అయితే ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. తాజాగా రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదోసారి జరిపిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఈ నెల 15న మరోసారి రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరుపనుంది.

వ్యవసాయ చట్టాలపై రైతులు, కేంద్రం వెనక్కి తగ్గలేదు. చట్టాలను రద్దు చేస్తేనే ఉద్యమం ఆపుతామని రైతులు తేల్చి చెప్పారు. చట్టాల రద్దుకు ప్రత్యామ్నాయం లేదని రైతు సంఘాలు అంటున్నాయి. 

ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం సాగదీస్తోందని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు చట్టాలను వెనక్కితీసుకునేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని కేంద్రమంత్రి తోమర్ చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశిస్తే చట్టాలను వెనక్కి తీసుకుంటామని పేర్కొన్నారు.