న్యూఢిల్లీ:నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు చేస్తున్న  ఆందోళనల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

రైతుల ఆందోళనలపై దాఖలైన పిటిషన్ ను గురువారం నాడు సుప్రీంకోర్టు విచారించింది.తొలుత రైతులను రోడ్లపై నుండి ఖాళీ చేయించాలనే అంశంపై విచారణ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. 

నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డే ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

తమ ఆందోళనను కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే చర్చల ద్వారా సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. ఢిల్లీని నిర్భంధిస్తే ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారన్నారు.  మీ ఉద్దేశాలు నెరవేరాలంటే చర్చలతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు.

సాగు చట్టాల అమలును నిలిపివేస్తే రైతులు కేంద్రంతో చర్చలకు ముందుకు వస్తారేమోనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.ఈ విషయమై పరిశీలించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. 

నిరసన యొక్క ఉద్దేశ్యం అహింసా మార్గాల ద్వారా నెరవేరాలన్నారు. నిరసనలు సమస్యల గురించే ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

రైతుల డిమాండ్ల విషయమై  ఓ కమిటీని ఏర్పాటు చేస్తే ప్రతిష్టంభన తొలిగే అవకాశం ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డే చెప్పారు. కేంద్రం, రైతు సంఘాలతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన ఇవాళ కూడ పునురుద్ఘాటించారు.ఈ విషయమై రైతుల స్పందనను కూడ తెలుసుకోవాలని భావిస్తున్నామన్నారు.