న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ  దేశ వ్యాప్తంగా  రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు  సోమవారం నాడు ఒక్కరోజు నిరహారదీక్షకు పూనుకొన్నారు.ఇవాళ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు  రైతులు నిరహారదీక్ష చేయనున్నారు. 

ఢిల్లీ -ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దుల్లోని ఘజీపూర్ రహదారిపై భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేష్ తికాయత్ సహా ఇతర నేతలు నిరహారదీక్షకు దిగారు. 

హర్యానా సరిహద్దుల్లోని సింఘి, టిక్రీ వద్ద కూడ రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. విపక్షాలు రైతు సంఘాల ఆందోళనలకు మద్దతు ప్రకటించాయి. ఈ నెల 8వ తేదీన రైతు సంఘాలు భారత్ బంద్ ను నిర్వహించాయి.ఈ బంద్ కు విపక్షాలు మద్దతిచ్చిన విషయం తెలిసిందే.

రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం పలు దఫాలు చర్చించినా ఫలితం లేకుండా పోయింది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తాము ఆందోళనలను విరమించబోమని రైతు సంఘాలు తేల్చి చెప్పాయి.సింఘ్రి వద్ద 33 మంది రైతు సంఘాల నేతలు నిరహారదీక్షకు దిగారు.