Asianet News TeluguAsianet News Telugu

సుప్రీంకోర్టులో రైతుల మరో సవాల్.. కేంద్ర మంత్రి కొడుకు బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

యూపీలోని లఖింపూర్ ఖేరిలో రైతులపై నుంచి వాహనాలను పోనిచ్చి మారణకాండకు పాల్పడిన కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశిశ్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయనకు అలహాబాద్ హైకోర్టు ఇటవలే బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ మంజూరును సవాల్ చేస్తూ రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

farmers filed petition in supreme court challenging ashish mishras bail in lakhimpur kheir case
Author
hyderabad, First Published Feb 21, 2022, 3:12 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గతంలో తెచ్చిన మూడు సాగు చట్టాల(Farm Laws)ను వ్యతిరేకిస్తూ ముఖ్యంగా పంజాబ్ నుంచి రైతులు(Farmers) పెద్ద సంఖ్యలో ఢిల్లీ సమీపంలో కనీసం ఏడాది పాటు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు వారి ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi) రైతులకు క్షమాపణలు చెప్పి మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత నిర్వహించిన పార్లమెంటు సమావేశాల్లో వివాదాస్పద మూడు సాగు చట్టాలను కేంద్రం రద్దు చేసింది. ఈ సాగు చట్టాల రద్దుకు ముందే యూపీలో నిర్వహించిన ఓ సభకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తుండగా వారిపై నుంచి వాహనాలు దూసుకెళ్లడంతో రైతులు మరణించిన ఘటన తెలిసిందే. ఆ ఘటనలో ప్రధాన నిందితుడిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా(Minister Ajay Mishra) కొడుకు అశిశ్ మిశ్రా (Ashish Mishra) ఉన్నారు. మరణించిన రైతు కుటుంబాలకు న్యాయం జరగాలని అప్పుడే రైతులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా, ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశిశ్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ మంజూరు మరణించిన రైతుల కుటుంబాలకు ఆగ్రహం తెప్పించింది. తమ ఆప్తులకు న్యాయం జరగాలని వారు ఆందోళనలో మునిగారు. ఈ నేపథ్యంలోనే వారు కేంద్ర ప్రభుత్వానికి మరో సవాల్ తెచ్చిపెట్టినట్టుగా తోస్తున్నది. చార్జిషీటులో కేంద్ర మంత్రి పుత్రుడు అశిశ్ మిశ్రాపై బలమైన నేరారోపణలు, ఆధారాలు ఉన్నప్పటికీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్‌తో వారు ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయించారు.

ముద్దాయి చేసిన దారుణమైన నేరాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు వాదించారు. చార్జిషీటులోని నిందితుడిపై ఉన్న బలమైన ఆధారాలు, ఆయన హోదా, పొజిషన్ వంటివి తమకు ఆందోళనకరంగా ఉన్నాయని పిటిషన్‌లో రైతుల కుటుంబాలు పేర్కొన్నాయి. ఆయన న్యాయ వ్యవస్థ నుంచి పారిపోయే ప్రమాదం ఉన్నదని, న్యాయాన్ని అడ్డుకోవడం, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆరోపించాయి.

అదే సమయంలో బాధితులు కేసుకు సంబంధించిన కీలకమైన విషయాలను హైకోర్టు దృష్టికి తేలేకపోయామని, తమ కౌన్సెల్‌ను ఈ కేసులో విచారణకు హాజరుకాకుండా జనవరి 18వ తేదీ నుంచే తప్పించారని రైతుల కుటుంబాలు తెలిపాయి. తమ వివరాలను నివేదిక రూపంలో చాలా అరుదుగా మాత్రమే కోర్టుకు సమర్పించగలిగారని, కోర్టు సిబ్బందికి తాము చాలా సార్లు చేసిన ఫోన్‌లకు స్పందన లేకుండా పోయిందని వివరించాయి. ఈ కేసును ప్రభావవంతంగా మళ్లీ విచారించాలని తాము చేసిన దరఖాస్తును హైకోర్టు కొట్టేసిందనీ పేర్కొన్నాయి. ఈ సందర్భంలో నిందితుడు అశిశ్ మిశ్రాకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం, ఆ బెయిల్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయకపోవడంతో తాము సుప్రీంకోర్టును ఆశ్రయించక తప్పలేదని వివరించాయి. ఫిబ్రవరి 15వ తేదీన అశిశ్ మిశ్రా జైలు నుంచి బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios