Asianet News TeluguAsianet News Telugu

రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయ్.. మీ నిరసన కొనసాగించండి: పంజాబ్‌లో కేసీఆర్

పంజాబ్ పర్యటనలో ఉన్న కేసీఆర్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలను మార్చేయవచ్చు అని అన్నారు. కనీస మద్దతు ధర కోసం కేంద్ర ప్రభుత్వంపై తమ పోరును కొనసాగించాలని సీఎం కేసీఆర్ రైతలకు విజ్ఞప్తి చేశారు.
 

farmers can change governments.. continue agitaion against centre telangana cm kcr says in punjab
Author
Chandigarh, First Published May 22, 2022, 6:08 PM IST

చండీగడ్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు పంజాబ్‌లో మాట్లాడారు. గాల్వన్ లోయ ఘర్షణలో మరణించి జవాన్‌లు, గతేడాది ఢిల్లీలో సాగు చట్టాకు వ్యతిరేకంగా ధర్నా చేస్తూ కన్నుమూసిన కిసాన్‌లకు ఆయన పంజాబ్‌లో నివాళులు అర్పించారు. పంజాబ్ వెళ్లిన ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తోపాటు వేదిక పంచుకున్నారు. అక్కడ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, రైతులు తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయని అన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ పొందే వరకు కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగించాలని ఆయన కోరారు. దేశవ్యాప్త నిరసనకు చేపట్టడానికి ఐక్యం కావాలని పిలుపు ఇచ్చారు. ఆ ఆందోళనలో తాను కూడా పాల్గొంటానని వివరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ వంటి ఇతర ప్రతిపక్ష పార్టీలతోపాటు తాము కూడా మద్దతు ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మన్, రైతు నేత రాకేశ్ టికాయత్ కూడా పాల్గొన్నాడు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు అనేక రైతు సమస్యలు ఉండేవని కేసీఆర్ అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుని బలవన్మరణాలకు పాల్పడేవారని తెలిపారు. అయితే, తాము ఆ దుస్థితి నుంచి బయటపడుతున్నామని చెప్పారు. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. కానీ, కేంద్ర ప్రభుత్వం వారికి మీటర్లు పెట్టి.. విద్యుత్ చార్జీలు వసూలు చేయాలని అడుగుతున్నదని అన్నారు. తాము చావనైనా చస్తామని, కానీ, సాగు మీటర్లు పెట్టబోమని స్పష్టం చేశారు. 

అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సరిహద్దుల్లో కూర్చుని కూడా రైతులకు సేవ చేసే అదృష్టాన్ని దక్కించుకున్నాడని కేసీఆర్ అన్నారు. తాము కూడా ఎల్లప్పుడూ తమ రైతు సోదర, సోదరీమణులకు అండగా ఉంటామని చెప్పారు. ఆందోళనల్లో మరణించిన ఆ రైతులను వెనక్కి తేలేకపోవచ్చని.. కానీ, తాము రైతులతో అండగా ఉండి వారి బాధలను పంచుకుంటామని తెలిపారు. రైతుల కోసం ఏ మంచి కార్యం చేసినా.. కేంద్ర ప్రభుత్వానికి గిట్టడం లేదని విమర్శలు చేశారు.

దేశ రాజకీయాలపై కన్నేసిన సీఎం కేసీఆర్ హస్తినకు పర్యటించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. స్థానిక పాఠశాలలు కేజ్రీవాల్‌తో కలిసి సందర్శించి ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నేత అఖిలేశ్ యాదవ్‌నూ కలుసుకున్నారు. తాజాగా, ఈ రోజు పంజాబ్‌ సీఎం భగవంత్ సింగ్ మన్‌తో వేదిక పంచుకున్నారు. అనంతరం, ఈ నెల 26న ఆయన బెంగళూరుకు వెళ్లి మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడను కలుసుకోనున్నారు. తర్వాతి రోజు మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధికి వెళ్లనున్నారు. అక్కడ సామాజిక కార్యకర్త అన్నా హజారేను కలవనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios