ఎక్కడా తగ్గని రైతులు.. ఢిల్లీ ముట్టడికి సిద్ధం.. మళ్లీ చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం
రైతులు (Farmers protest) మరో సారి ఢిల్లీని (Delhi Chalo) ముట్టడించనడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా (Union Agriculture and Farmers Welfare Minister Arjun Munda) స్పందించారు. మరో సారి చర్చలకు రావాలని ప్రభుత్వం తరుఫున రైతులను ఆహ్వానించారు.
ఎంఎస్పీకి చట్టబద్దత, పంట వ్యర్థాల సమస్యలతో పాటు పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తలపెట్టిన ‘ఢిల్లీ చలో’కు తాత్కాలిక విరామం ఇచ్చిన రైతులు.. మళ్లీ దానిని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఎంఎస్పీ కోసం కేంద్ర మంత్రులు చేసిన ప్రతిపాదనలు తిరస్కరించి, మళ్లీ ఢిల్లీ మట్టడించాలని నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.
మరో సారి అన్ని అంశాలను చర్చించడానికి రైతు నాయకులతో మరో దఫా చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా బుధవారం తెలిపారు. దేశ రాజధానికి రైతుల కవాతు 'ఢిల్లీ చలో' పునఃప్రారంభానికి ముందు ఆయన చర్చలకు ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’(ట్విట్టర్)లో పోస్టు పెట్టారు. ‘రైతు నేతలను మళ్లీ చర్చకు ఆహ్వానిస్తున్నాను. మనం శాంతిని కాపాడుకోవడం చాలా ముఖ్యం’ అని తెలిపారు.
కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పై ప్రభుత్వ ప్రతిపాదనను రైతు నాయకులు తిరస్కరించిన నేపథ్యంలో నిరసనకారులు శాంతిని కాపాడాలని కేంద్ర మంత్రి అర్జున్ ముండా మంగళవారం విజ్ఞప్తి చేశారు. ‘‘చర్చల నుంచి పరిష్కారాలు కనుగొనాలి. మనమందరం కలిసి సమస్యను పరిష్కరించాలని, మేధోమథనం చేయాలని నేను కోరుకుంటున్నాను.’’ అని మంత్రి తెలిపారు.
ఇదిలా ఉండగా.. పంజాబ్-హర్యానా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భద్రతా దళాలు రైతులపై బుధవారం ఉదయం అడపాదడపా బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి. ఢిల్లీని ముట్టడించడానికి 1,200 ట్రాక్టర్ ట్రాలీలు, 300 కార్లు, 10 మినీ బస్సులతో సుమారు 14,000 మంది రైతులు సరిహద్దు వెంబడి గుమిగూడారు. పోలీసు బారికేడ్లను తొలగించడానికి నిరసనకారులు ప్రత్యేక పరికరాలను కూడా తీసుకొచ్చాయి. అయితే వాటిని స్వాధీనం చేసుకోవాలని మర్యానా పోలీసులు పంజాబ్ పోలీసులను కోరారు. మరో వైపు రైతులు దేశ రాజధానికి తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై ప్రవేశ మార్గాలను సురక్షితంగా ఉంచేందుకు విన్యాసాలు నిర్వహిస్తున్నారు.
కాగా.. రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతారని కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకుడు సర్వాన్ సింగ్ పంధేర్ పునరుద్ఘాటించారు, బారికేడ్లను తొలగించాలని. తమను ఎలాంటి ఆటంకం లేకుండా ఢిల్లీకి అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ వైపు నుంచి అన్ని ప్రయాత్నాలు చేశామని, సమావేశాలకు హాజరయ్యామని తెలిపారు. ప్రతీ అంశంపై చర్చించామని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు. తాము శాంతియుతంగా ఉంటామని, ఈ అడ్డంకులను తొలగించి ఢిల్లీ వైపు ర్యాలీ తీయడానికి తమకు అనుమతి ఇవ్వాలని కోరారు.