దేశాన్ని సర్కారీ తాలిబాన్ ఆక్రమించుకుంది: రైతులపై లాఠీ చార్జ్‌ను ఖండించిన రాకేశ్ తికాయత్
రైతులపై హర్యానా పోలీసుల లాఠీ చార్జ్‌ను రైతు నేత రాకేశ్ తికాయత్ తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వాన్ని సర్కారీ తాలిబాన్ అని పేర్కొన్నారు. దేశాన్ని సర్కారీ తాలిబాన్ గుప్పిట్లోకి తీసుకుందని విమర్శలు చేశారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టార్ వ్యవహార శైలి జనరల్ డయ్యర్ తరహాలోనే ఉన్నదని ఆరోపించారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై రైతు నేత రాకేశ్ తికాయత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హర్యానాలో రైతులపై లాఠీ చార్జ్ చేయడానికి ఖండించారు. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశాన్ని సర్కారీ తాలిబాన్లు ఆక్రమించుకున్నారని ఆరోపణలు చేశారు. వారి కమాండర్లు రైతుల తలలు పగులగొట్టాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని పేర్కొన్నారు.
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే లక్ష్యంతో రైతులు శనివారం కర్నాల్ సమీపంలోని బస్తారా టోల్ ప్లాజా దగ్గర ఆందోళనకు దిగారు. వీరిని చెదరగొట్టడంలో భాగంగా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. పరిస్థితులు పట్టుతప్పుతున్నాయనే క్రమంలో బలప్రయోగం జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కనీసం పది మంది రైతులు గాయాలపాలయ్యారు. ఇదే రోజున కర్నాల్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ పోలీసులకు సూచనలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. హద్దుమీరిన రైతుల తలలు పగులగొట్టాలని, ప్రత్యేకంగా ఆదేశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని పోలీసులకు సూచనలు చేస్తున్న వీడియోపై బీజేపీ సహా అన్ని పార్టీలు, వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి.
ఈ వీడియోను పేర్కొంటూ రాకేశ్ తికాయత్ ఆదివారం కేంద్రంపై విరుచుకుపడ్డారు. సర్కారీ తాలిబాన్లు దేశాన్ని తమ గుప్పిట్లో బంధించుకున్నారన్నారు. వారి కమాండర్లు దేశవ్యాప్తంగా ఉన్నారని తెలిపారు. వీరిని గుర్తించాల్సి ఉందని చెప్పారు. రైతుల తలలు పగుల గొట్టాలని చెప్పిన వ్యక్తి ఈ కమాండర్‌లలో ఒకరని ఆరోపణలు చేశారు.
అంతేకాదు, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్‌పైనా రాకేశ్ తికాయత్ విమర్శలు చేశారు. సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ వ్యవహార శైలి జనరల్ డయ్యర్ తరహాలోనే ఉన్నదని ఆరోపించారు. రైతులపై పోలీసులు దాడులను సహించేది లేదని స్పష్టం చేశారు. రైతుల ప్రతిదానికి లెక్క చెబుతారని హెచ్చరించారు.