వలస కార్మికులు అంటేనే... వేల కిలోమీటర్లు ఈ లాక్ డౌన్ కాలంలో నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలే మనకండ్ల ముందు కదలాడుతాయి. జీతాలు అందక, తినడానికి తిండిలేక, కనీసం ఇంటి దగ్గర తినడానికి కనీసం తిండైనా దొరుకుతుంది అన్న ఉద్దేశంతో వారు అంత దూరాన్ని రాష్ట్రాలను దాటుకుంటూ వెళుతున్నారు. 

కానీ ఇందుకు భిన్నంగా ఢిల్లీ పక్కనున్న ఒక గ్రామంలో వలస కూలీలను తన పొలంలో పనికి కుదుర్చుకున్న ఒక రైతు ఈ లాక్ డౌన్ ముగియడంతో వారందరినీ విమానంలో ఇంటికి పంపిస్తున్నాడు. 

వివరాల్లోకి వెళితే.... పాపన్ సింగ్ అనే రైతు 1993 నుంచి పుట్టగొడుగుల సాగు చేస్తున్నాడు. ఆగష్టు నుంచి మార్చ్ వరకు వీటి సాగు కాలం. మార్చ్ చివరినాటికి పంటకాలం పూర్తయింది. కూలీలు బీహార్ లోని తమ సొంత ఇంటికి వెళదాము అని అనుకుంటుండగానే లాక్ డౌన్ ను ప్రకటించింది భారత ప్రభుత్వం. 

వారిని ఇంటికి పంపించడానికి వారిని ఉద్యోగంలో పెట్టుకున్న రైతు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఏవి ఫలించలేదు. ఆ తరువాత శ్రామిక్ రైళ్లలోనయినా తన వద్ద పనిచేస్తున్న 10 మంది వలస కూలీలను పంపిద్దామని ప్రయత్నం చేసాడు. అది కూడా కుదర్లేదు. 

దానితో విమానాలు ప్రారంభమయ్యాక ఆ పది మందికి 68 వేలు పెట్టి టిక్కెట్లను కొనిచ్చాడు. దానితోపాటుగా ప్రతిఒక్కరికి చేతిఖర్చుల నిమిత్తం మూడు వేల రూపాయలను ఇచ్చాడు. నేటి ఉదయం ఫ్లైట్ కి వారంతా ఢిల్లీ నుండి పాట్నా బయల్దేరారు. 

వలస కూలీలు అలా నడుచుకుంటూ వెళుతుండడం, ఆక్సిడెంట్ల వలన, వడదెబ్బకు మరణించడం చూసిన సదరు రైతు పాపన్ సింగ్ తన వద్ద పని చేస్తున్నవారిని మాత్రం అలా పంపించదల్చుకోలేదు. వారందరికీ ఇన్ని రోజులపాటు, మూడు పూటలా భోజన ఏర్పాట్లు చేసాడు. 

వారందరికీ ఏ లోటు రాకుండా చూసుకొని నేటి ఉదయం తన సొంత వాహనాల్లో ఎయిర్ పోర్టులో దింపి వచ్చాడు. వారందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి హెల్త్ సర్టిఫికెట్లను కూడా డాక్టర్ వద్ద ఇప్పించాడు. 

విమానం ఎక్కేముందు ఆ కూలీలు మాట్లాడుతూ... జీవితంలో ఎప్పుడూ తాము విమానం ఎక్కుతామని అనుకోలేదని, ఇప్పుడు విమానం ఎక్కుతున్నందుకు సంతోషంగా ఉన్నప్పటికీ.... ఒకింత టెన్షన్ గా కూడా ఉందని వారన్నారు. 

తొలుత తాము విమానంలో ఇంటికి వస్తున్నారంటే ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదని, ఎప్పుడైతే పాపన్ సింగ్ మాట్లాడి అవును నిజం అని చెప్పాడో అప్పుడు వారు కూడా నమ్మారని సంతోషంగా తెలిపారు.