ఓ రైతు తన పొలాన్ని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం 12 నెమళ్ల ప్రాణాలను తీసింది. తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూర్ జిల్లా వాణియంబాడిలో ఈ  ఘటన జరిగింది. రైతు షణ్ముగంను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 

తమిళనాడులో (tamilnadu) దారుణం జరిగింది. పొలంలో ఓ రైతు పెట్టిన ఎలుకల మందు తిని భారీగా నెమళ్లు (peacock deaths) మృత్యువాతపడ్డాయి. ఈ ఘటనకు కారణమైన రైతుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తిరుపత్తూర్ జిల్లా (tirupattur district) వాణియంబాడి పక్కనే (vaniyambadi) ఉన్న నాచియార్ కుప్పం ప్రాంతానికి చెందిన షణ్ముగం (75) ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. అతను కొన్ని నెలల క్రితం అదే ప్రాంతంలోని సావిత్రి అనే మహిళ నుంచి భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. 

ఈ క్రమంలో నెమళ్లు తన పంటను ధ్వంసం చేస్తున్నాయని.. గుర్తించాడు. దీంతో వాటి బారినుంచి పంటను కాపాడుకోవడం కోసం విషం కలిపిన ధాన్యాన్ని పొలంలో జల్లాడు. ఈ నేపథ్యంలో ఆ ధాన్యాన్ని తిని నెమళ్ళు మరణించాయి. అయితే తమ పొలం ఎలా వుందో చూసేందుకు సావిత్రి కుమారుడు సిలంబరసన్‌ వెళ్ళగా.. అక్కడ 12 నెమళ్లు మరణించి ఉండడం గమనించాడు. అనంతరం వెంటనే అలంగాయం అటవీశాఖకు సమాచారం అందించాడు.

సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖాధికారులు నెమళ్లకు విషం తిని చనిపోయిట్లు గుర్తించారు. ఆ నెమళ్లను స్వాధీనంలోకి తీసుకుని.. రైతు షణ్ముగంను అరెస్ట్ చేశారు. అలాగే చనిపోయిన నెమళ్లకు పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం దహన సంస్కారాలు నిర్వహించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అయితే తిరుపత్తూరు జిల్లాలో నెమళ్లకు విషం పెట్టి చంపిన ఘటన ఇదే తొలిసారి కాదు... జాతీయ పక్షి అయిన నెమలిని చంపడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని, ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.