కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతన్నలు తమ ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు. వ్యవసాయం చ‌ట్టాలు వెన‌క్కి తీసుకునే వ‌ర‌కు త‌మ పోరు కొన‌సాగుతూనే ఉంటుంద‌ని అన్న‌దాత‌లు స్ప‌ష్టం చేశారు.

ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో నిర‌స‌న‌లు తెలుపుతున్న రైతులు.. ఢిల్లీ - జైపూర్ హైవే దిగ్బంధించాల‌ని పిలుపునిచ్చారు. దీంతో ఆ రహదారిపైకి రైతులు భారీ సంఖ్య‌లో చేరుకుంటున్నారు. ఈ క్ర‌మంలో గుర్గావ్ వ‌ద్ద 2 వేల మంది పోలీసులు, ఫ‌రీదాబాద్ వ‌ద్ద 3,500 మంది పోలీసులు మోహరించారు.

ఇక రైతుల ఆందోళ‌న దృష్ట్యా ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో పోలీసులు భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. సింఘు, టిక్రి, ఘాజిపూర్ స‌హా ప‌లు ర‌హ‌దారుల‌ను మూసివేశారు. దేశ వ్యాప్తంగా టోల్ గేట్ల వ‌ద్ద రుసుములు క‌ట్ట‌కుండా నిర‌స‌న తెల‌పాల‌ని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో టోల్ గేట్ల వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు. 

మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ చట్టాల వల్ల రైతులు కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలపై బతకాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని బీకేయూ అధ్యక్షుడు భాను ప్రతాప్‌సింగ్‌ తన పిటిషన్‌లో ఆందోళన వ్యక్తంచేశారు.