దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతోందనేది నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇప్పటికీ మూఢనమ్మకాలను విశ్వసిస్తూ.. మనుషుల ప్రాణాలను సైతం తీస్తున్నవారు నాణేనికి మరోవైపు ఉన్నారు. అనారోగ్యం బారిన పడిన పసిబిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించాల్సింది పోయి.. భూతవైద్యుడు వద్దకు తీసుకువెళ్లారు ఓ తల్లిదండ్రులు. అతను చెప్పిన మాటలు విని బిడ్డను వదిలించుకోవాలని చూశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్ ఫూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. షాజహాన్ పూర్ కి చెందిన ఓ జంటకు ఇటీవల ఆడబిడ్డ జన్మించింది. కాగా.. కొద్ది రోజులుగా పాప ఆరోగ్యం సరిగా ఉండటంలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాల్సింది పోయి భూతవైద్యున్ని కలిశారు తల్లిదండ్రులు.

అతడు కాస్తా పాప శరీరంలో చెడు ఆత్మ ఉంది. దాని వల్ల మీ కుటుంబానికి నష్టం వాటిల్లుతుందని చెప్పాడు. పాపను వదిలించుకోకపోతే ప్రాణ నష్టం వాటిల్లుతుందని హెచ్చరించాడు. దాంతో ఊరి దగ్గర ఉన్న చెరువులో పాపను పడేసేందుకు నిశ్చయించుకున్నాడు కసాయి తండ్రి. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ లోపు అక్కడికి చేరుకోవడంతో చిన్నారిని సురక్షితంగా కాపాడారు. అనంతరం పాప తండ్రితో పాటు, మాంత్రికున్ని కూడా అరెస్ట్‌ చేశారు.