ఓ కుటుంబం కుక్క అనుకుని నక్కను పెంచుకుంది. ఆరు నెలల తరువాత అది మొరగకుండా ఊళ పెడుతుండడంతో షాక్ అయ్యి.. అది నక్క అని తెలుసుకున్నారు. ఆ తరువాత.. 

బెంగళూరు : బెంగళూరులో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. కింగేరిలో ఉంటున్న ఒక కుటుంబ సభ్యులకు కుక్కలు అంటే చాలా ఇష్టం. ఇదే ప్రేమతో తమకు దొరికిన ఒక కుక్కపిల్లను ఇంటికి తీసుకువచ్చారు. ఆరు నెలలుగా దాన్ని ప్రేమగా సాకుతూ.. ఇంట్లోని మనిషిగా చూసుకున్నారు. వయసు పెరిగే కొద్దీ అది మొరగడం లేదు.. అంతేకాకుండా విచిత్రమైన శబ్దం చేస్తూ ఉంది. వారి ఇంటికి వచ్చిన వారు, చుట్టుపక్కల వారు దాన్నిచూసి మీ కుక్క.. నక్క లాగా ఉంది ఏంటి అన్నా వారు పట్టించుకోలేదు.

ఆ తర్వాత కొద్ది రోజులకే అది ఊళ వేస్తుండడంతో తమ వద్ద ఉన్నది కుక్క కాదని… నక్క అని తెలుసుకున్నారు. దీనికి తోడు అది పాలు తాగకపోవడం.. మాంసాహారాన్ని ఇష్టంగా తినడం చూసి.. దానిని నక్క అని కన్ఫామ్ చేసుకున్నారు. ప్రాణిదయా సంఘం ప్రతినిధులకు చెప్పడంతో నగర శివార్లలోని అటవీ విభాగంలో దానిని వదిలి పెట్టి వచ్చారు.