ఆడపిల్ల కనపడితే చాలు.. ఎన్ని రకాలుగా వేధించాలో... అన్ని రకాలుగా వేధించే కామాంధులు మన చుట్టూనే చాలా మంది ఉన్నారు. బయట, సోషల్ మీడియా అనే తేడా లేకుండా... లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. ఓ యువతికి సోషల్ మీడియాలో ఇలాంటి వేధింపులే ఎదురయ్యాయి. అయితే.. తనను వేధించిన నీచుడికి యువతి తనదైన శైలిలో బుద్ధి చెప్పింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన ఓ యువతికి సోషల్ మీడియాలో వేధింపులు మొదలయ్యాయి. యువతికి అశ్లీల చిత్రాలు పంపుతూ వేధించాడో 29ఏళ్ల యువకుడు. చాలాసార్లు.. తనకు అలాంటి చిత్రాలు పంపవద్దని ఆమె బ్రతిమిలాడింది. కానీ అతను వినిపించుకోలేదు. రెచ్చిపోయి ప్రవర్తించాడు. బెదిరింపులకు పాల్పడేవాడు. దీంతో.. అతనికి బుద్ధి చెప్పేందుకు యువతి మాష్టర్ ప్లాన్ వేసింది. 

 అతని బెదరింపులకు లొంగినట్లు నటించింది. అతనిని తన  ఇంటికి పిలిపించింది. తన బెదిరింపులకు యువతి లొంగిపోయిందని భావించాడు.  తన కోరిక తీరుస్తుందని సంబరపడిపోయాడు. యువతి చెప్పినట్లుగానే ఆమె ఇంటికి వెళ్లాడు. అయితే.. ఆ నీచుడికి శాస్తి చేసేందుకు యువతి తగిన ఏర్పాట్లు చేసింది.

 అతను రాగానే అప్పటికే సిద్ధంగా ఉన్న ఆమె కుటుంబసభ్యులు అతన్ని చితకబాదారు. అనంతరం పోలీసులకు పట్టించారు. నిందితుడు ఓ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలో డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.